వీసీ పోస్టుకు తెరవెనుక మంత్రాంగం

3 Apr, 2015 00:51 IST|Sakshi

మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం తెరవెనుక మంత్రాంగం నడుస్తోంది. ప్రస్తుతం వీసీగా విధులు నిర్వహిస్తున్న ఉన్నం వెంకయ్య ఈనెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ యూనివర్సిటీకి ఇద్దరు వీసీలు పనిచేయగా, వారు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. రొటేషన్ పద్ధతిలో ఈ సారి బీసీలకు లేదా ఎస్సీ మహిళకు వీసీ పోస్టు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు వీసీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, మచి లీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఇద్దరూ బీసీలే కావడంతో వారి కనుసన్నల్లోనే బీసీనే వీసీగా నియమించే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్లు చెప్పుకొంటున్నారు. కృష్ణా వర్సిటీతో పాటు నాగార్జున యూనివర్సిటీ వీసీ వియన్నారావు కూడా ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు.  
 
వీసీ వెంకయ్య ఉన్నత పదవి!


హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దీర్ఘకాలం పనిచేసిన ఉన్నం వెంకయ్య పదవీ విరమణకు సమీపంలోకి వచ్చిన అనంతరం కృష్ణా వర్సిటీ వీసీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేసుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సీఎం రమేష్, కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. వీసీగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలకు కొంతమేర అడ్డుకున్నారని ప్రొఫెసర్లు చెప్పుకొంటున్నారు. అయితే యూనివర్సిటీకి సంబంధించిన భవనాల నిర్మాణం ప్రారంభించలేకపోయారు. కృష్ణా యూనివర్సిటీకి వీసీని నియమించాలంటే సెర్చ్ కమిటీ ఆమోదం తెలపాలని, భారీ తతంగం ఉంటుందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నారు.
 
రిజిస్ట్రార్ పోస్టు కోసం పోటాపోటీ

ప్రస్తుతం కృష్ణా వర్సిటీ రిజిస్ట్రార్‌గా డి.సూర్యచంద్రరావు కొనసాగుతున్నారు. ఈ పోస్టులో మూడేళ్ల తరువాత కొత్తవారిని నియమించాలి. అయితే సూర్యచంద్రరావు ఐదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. యూని వర్సిటీ పరిధిలోని నూజివీడు పీజీ సెంటర్ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న బసవేశ్వరరావు రిజిస్ట్రార్ పోస్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం సూర్యచంద్రరావును కొనసాగించాలని, మరోవర్గం బసవేశ్వరరావును రిజిస్ట్రార్‌గా ఇక్కడకు తీసుకురావాలని మంత్రాంగం నడపడం గమనార్హం.

భవనాల నిర్మాణం ఎప్పటికో..

మచిలీపట్నంలో 2008లో కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. ఏడేళ్లుగా ఆంధ్ర జాతీయ కళాశాలలోని 21 గదుల్లోనే వర్సిటీ కొనసాగుతోంది. భాస్కరపురంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడ కొన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే యూనివర్సిటీకి రుద్రవరంలో 102 ఎకరాలు, గూడూరులో 44 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.77కోట్లతో యూనివర్శిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెబుతున్నా ఇంతవరకు శంకుస్థాపనకు నోచలేదు. ఈ పనులు ఎప్పటికి ప్రార ంభిస్తారనే అంశంపైనా స్పష్టత లేదు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకేతర సిబ్బంది బాగోగులను పట్టించుకునే వారు లేరన్న వాదన ఉంది. ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం తక్షణమే కొత్త వీసీని ప్రకటించే అవకాశం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా