కమిషనర్‌ సీటు కావాలా..?

23 Jun, 2020 08:40 IST|Sakshi
పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం

మూడునెలల్లో రిటైర్‌ కానున్న ప్రస్తుత కమిషనర్‌ 

ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న కొందరు ఉద్యోగులు 

ప్రమోషన్‌ పొంది మళ్లీ ఇక్కడికే పోస్టింగ్‌ తెచ్చుకున్న మేనేజర్‌ 

పలమనేరు మున్సిపాలిటీలో తెరవెనుక రాజకీయాలు

సాక్షి, పలమనేరు: తాతపోతే బొంతనాదన్నట్టు తయారైంది పలమనేరు మున్సిపాలిటీలో పరిస్థితి. మరో మూడునెలల్లో ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి పదవీ విరమణ చెందనున్నారు. దీంతో ఆ పోస్టుపై ఇదే కార్యాలయానికి చెందిన కొందరి కన్ను పడింది. దీంతో పక్కాగా ఓ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వారి ప్రయత్నాల్లో వారు తలమునకలైనట్లు సృష్టమవుతోంది.  

నిబంధనలు ఇలా.. 
సాధారణంగా కమిషనర్‌ బదిలీ గానీ రిటైర్డ్‌ గానీ అయితే ఆ పోస్టుకు రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే వీలుగాని పక్షంలో అదే కార్యాలయంలోని గెజిటెడ్‌ హోదా కలిగిన ఇంజినీరింగ్‌ డీఈ, లేదా మేనేజర్‌ను ఇన్‌చార్జ్‌ లేదా ఎఫ్‌ఏసీగా రెగ్యులర్‌ కమిషనర్‌ వచ్చే దాకా నియమించుకోవచ్చు. అయితే ఇన్‌చార్జ్‌ ఇస్తే పవర్‌ ఉండదు. అందుకే ఎవరు ఈ పోస్టుకొచ్చినా ఎఫ్‌ఏసీనే కోరుకుంటారు. ఈ తంతు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల పలుకుబడిని బట్టి జరిగే అవకాశాలుంటాయి. 

ఇక్కడ సాగుతున్న తంతు మరోలా.. 
ఇదే కార్యాలయంలో ఇంజినీరింగ్‌ విభాగం ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాకు ముందు డీఈగా పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రాముఖ్యతను బట్టి కమిషనర్‌ లేనపుడు డీఈకి ఇన్‌చార్జ్‌ లేదా ఎఫ్‌ఏసీ కమిషనర్‌ చాన్స్‌ ఉంటుంది. ఇదే ఆశతో సదరు అధికారి ఇప్పటికే స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకుని బెర్తు తనకేనని సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇన్‌చార్జ్‌ లేదా ఎఫ్‌ఏసీ కమిషనర్‌ అవకాశం మేనేజర్‌కు దక్కే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించిన ఇక్కడి మేనేజర్‌ తన సత్తా ఏంటో చూపింది. గత ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ తాజాగా గ్రేడ్‌–3 నుంచి గ్రేడ్‌–2 మేనేజర్‌గా ప్రమోషన్‌ పొందారు.

అయితే ప్రమోషన్‌తో పాటు ట్రాన్స్‌ఫర్‌ వస్తుందని అందరూ భావించారు. కానీ చక్రం తిప్పిన ఆ మేనేజర్‌ ప్రమోషన్‌ పొంది ఇక్కడికే రిటైన్‌ చేయించుకున్నారు. ఈ తతంగం వెనుక బడాహస్తమే ఉన్నట్టు స్థానిక కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాంగ్‌ స్టాండిగ్‌లో ఉన్న మేనేజర్‌ మళ్లీ ఇక్కడికే బదిలీ చేయించుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీన్నంతా గమనిస్తున్న రాయదుర్గం మున్సిపల్‌ మేనేజర్‌ తన పలుకుబడిని ఉపయోగించి పలమనేరు మేనేజర్‌గా బదిలీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఆయన పెద్దనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. చదవండి: మార్పు వైపు మరో అడుగు

రెగ్యులర్‌ కమిషనర్‌ వస్తే అన్నిటికీ చెక్‌.. 
మున్సిపాలిటీలో సాగుతున్న ఎత్తులు, పైఎత్తులను స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇప్పటికే పసిగట్టినట్టు తెలిసింది. గత కొన్నాళ్లుగా మున్సిపాలిటీలో గాడితíప్పిన పాలనపై తన షాడోల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఆయన కొందరు అధికారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలమనేరు పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 55,373 జనాభా ఉన్నారు. ఇప్పుడది 60 వేలకు మించింది. గత ఐదేళ్లుగా పురపాలకసంఘంలో సాగిన వ్యయ, ఆదాయాల మేరకు ప్రస్తుతం గ్రేడ్‌–3లో ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్‌–2గా మార్చే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్‌ కమిషనర్‌ను నియమించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.  చదవండి: అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్‌   

మరిన్ని వార్తలు