జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తొలి, మలి దశలు ఖరారు

29 Mar, 2014 01:39 IST|Sakshi

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తొలి, మలి దశల పోలింగ్ ఖరారైంది. జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండగా మచిలీపట్నం, విజయవాడల్లో ఏప్రిల్ ఆరో తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. నూజివీడు, గుడివాడ డివిజన్లలో 11న మలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల జిల్లా పర్యవేక్షణాధికారిణి, ఉడా వైస్ చైర్‌పర్సన్ పి.ఉషాకుమారి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన ఆమె స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. గుడ్లవల్లేరు మండలంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ఎంపీడీవో పి.రమాదేవిని ఆమె ఆరా తీశారు. ఓటరు జాబితాల్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగారు. ఎన్నికల అధికారులకు మెటీరియల్ అందజేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల బడ్జెట్ విడుదలపై ఆరా తీశారు. ఎన్నికల మెటీరియల్ చేరకపోతే తెలియజేయాలన్నారు.

ఎన్నికల కేంద్రాల్లో స్టాంప్ ప్యాడ్‌లు, రూలర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, ర్యాంప్‌ల వసతుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులందరికీ సమాచారం ఇవ్వాలని, వారికి శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చే కోడింగ్‌ను జాగ్రత్తగా చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అపమ్రత్తంగా ఉండాలని తెలిపారు. జోనల్, రూట్ ఆఫీసర్లతో పాటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తు తీసుకోవాలని ఆదేశించారు.
 
స్ట్రాంగ్ రూమ్ గుడివాడలోనే...
 
గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక బ్యాలెట్ బాక్సుల్ని ఎక్కడ భద్రపరచనున్నారని గుడివాడ ఆర్గీవో వెంకట సుబ్బయ్యను ఉషాకుమారి అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ గుడివాడ ఏఎన్నార్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పామర్రు మండల బాక్సులు కూడా గుడివాడలోనే భద్రపరిచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఉషాకుమారి సూచించారు.
 

>
మరిన్ని వార్తలు