‘వెనుకబడిన’ పనులు

26 Dec, 2013 04:08 IST|Sakshi

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (బీఆర్జీఎఫ్) పథకంతో జిల్లాలో చేపట్టిన పనులు వెనుకబడిపోయాయి. ఏళ్లు గడస్తున్నా సగం పనులు కూడా పూర్తి చేయకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. వివిధ  పథకాలతోపాటు గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, అర్బన్ లోకల్ బాడీస్ (పట్టణాలు, నగరాలు)లకు ప్రధానంగా నిధులు వచ్చే పథకం బీఆర్‌జీఎఫ్. ప్రతి ఆర్థిక సంవత్సరం జిల్లా యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయించి, విడుదల చేస్తుంది. బీఆర్‌జీఎఫ్ నిధుల్లో గ్రామపంచాయతీలకు 50 శాతం, మండల ప్రజాపరిషత్‌లకు 30 శాతం, జిల్లా ప్రజాపరిషత్‌కు 20 శాతం వాటా ఉంటుంది. అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా వందశాతంతో కూడిన మంజూరు ఉంటుంది.
 
  ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు (అంగన్‌వాడీ, కమ్యూనిటీ హాల్స్ తదితర), పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మూత్రశాలల నిర్మాణం చేపట్టాలి. ఒకసారి కేటాయించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి (మాడిఫికేషన్) వీల్లేదు. మరమ్మతు పనులు చేయరాదు. ఈ నిబంధనల ప్రకారం డీపీసీ ఆమోదంతో ముందుగా ప్రభుత్వానికి వార్షిక యాక్షన్ ప్లాన్ పంపిస్తారు. ప్లాన్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. యాక్షన్ ప్లాన్ ప్రకారం అదే ఆర్థిక సంవత్సరం లోపు పనులు పూర్తికావాల్సి ఉంటుంది.
 
 నత్తనడకన పనులు
 జిల్లాలో అనుకున్నంత వేగంగా పనులు కావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్నా కొన్ని మొదలే కాలేదు. గతేడాది పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయంటే జిల్లాలో బీఆర్‌జీఎఫ్ పనుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ.29.14 కోట్లతో 1797 పనులు చేపట్టారు. పనులన్నీ ఆ ఏడాదిలోనే పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు 787 పనులు మాత్రమే పూర్తయ్యా యి. 1010 పనులు కొనసాగుతున్నాయి. 2013-14 సంవత్సరం రూ.35.75 కోట్లతో 2,681 పనులు చేపట్టాలని యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. అందులో మొదటి విడతగా వారం రోజుల క్రితం రూ.26 కోట్లు విడుదల కాగా, ఇంకా చెల్లింపులు జరగలేదు. ఈ ఏడాది చేపట్టిన పనులు 2014 మార్చితో పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు. భూ వివాదాలు, అవసరం లేకపోవడం తదితర కారణాలతో పది శాతం వరకు పనులు మొద లు కాలేదని అధికారులు చెబుతున్నారు. మిగ తా పనుల్లో విపరీతమైన జాప్యంతో ఒక ఏడాది పనులు మరో ఏడాదిలో కూడా పూర్తికాని విచిత్ర పరిస్థితి. మార్చిలోగా పనులు పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, పనులు, నిధుల విడుదల ఆలస్యంతో బీఆర్జీఎఫ్ ప్రక్రియ పూర్తికావడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
 జనవరిలోగా పూర్తిచేయకపోతే చర్యలు
 - చక్రధర్‌రావు, జెడ్పీ సీఈవో
 
 2012-13 సంవత్సరానికి సంబంధించిన పనులు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోగా పూర్తి కాకపోతే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. 2013-14 సంవత్సరానికి సంబంధించిన పనులు కూడా 2014 మార్చిలోగా పూర్తి చేయాలి. దీనిపై నిత్యం సమీక్షిస్తున్నాం. భూ వివాదాలు, స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని పనుల్లో  జాప్యం జరుగుతోంది. అలాంటివి మినహాయించి మిగతా పనులు సకాలంలో పూర్తిచేయకపోతే చర్య తప్పదు.
 

మరిన్ని వార్తలు