గడ్డుకాలం

27 Jul, 2015 02:23 IST|Sakshi

 చీమకుర్తి : వరుణుడు కరుణించి ఎడతెరిపి లేకుండా రెండు వారాల పాటు మహారాష్ట్ర, కర్నాటకలో భారీవర్షాలు కురిస్తే తప్ప రానున్న రోజులు రైతులకు గడ్డుకాలమే. తాగటానికి నీళ్లు అంతంత మాత్రమే కాగా వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించటం లేదు. రామతీర్థం రిజర్వాయర్, నాగార్జునసాగర్ డ్యామ్‌లోని నీటి నిల్వలే ఇందుకు తార్కాణం. చీమకుర్తి ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం...రామతీర్థం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు (1.53 టీఎంసీలు) కాగా దాని డెడ్‌స్టోరేజీ 74.93 మీటర్లు(0.26 టీఎంసీ).

ప్రస్తుతం రిజర్వాయర్‌లో కేవలం 75 మీటర్లు మాత్రమే సాగర్ జలాలున్నాయి. వారం రోజుల పాటు ఒంగోలు సమ్మర్ స్టోర్ ట్యాంక్‌లకు తాగునీరు ఇవ్వడం వలన దాదాపు వచ్చే సెప్టెంబర్ వరకు ఒంగోలుకు తాగునీటి అవసరం ఉండకపోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒంగోలులోని రెండు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు కలిపి 5,800 మిలియన్ లీటర్లు నీటి అవసరం కాగా వారం రోజులుగా 3 వేల మిలియన్ లీటర్ల నీటిని వదిలారు. ఇంకా నీటి అవసరం ఉన్నప్పటికీ రెండు నెలల పాటు సర్దుకుపోవడానికి అవకాశం ఉంది. అయితే జిల్లాలోని తాగునీటి చెరువులు, ఇతర ట్యాంక్‌లకు కలిపి 1.5 టీఎంసీల అవసరం ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఇండెంట్ ఇచ్చారు.

ఆ నీటిని సరఫరా చేసే పరిస్థితిలో చీమకుర్తి రామతీర్థం రిజర్వాయర్ లేదని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం ఆదివారం నాటికి నీటిమట్టం 510.5 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్‌లో అది డెడ్‌స్టోరేజీ మట్టం. కాబట్టి సాగర్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. కోర్టు ఉత్తర్వులో లేక సీఎంల స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్ప తాగునీటికి సాగర్ నుంచి వదలరు.  రానున్న రోజుల్లో జిల్లాలో తాగునీటికి కష్టకాలం ఏర్పడే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్న గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

తాగునీటికే అలా ఉంటే ఇక వ్యవసాయానికి నీటిని ఏమిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమై రెండు నెలలైంది. వరినార్లు పోసుకునే గడువు రావడంతో రైతులు చెరువులు, రామతీర్ధం రిజర్వాయర్‌లు, కాలువల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాగునీటి కొరతతో రైతులు వరినార్లు పోసుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలనే సూచన ఉన్నతాధికారుల నుంచి చేయించేందుకు ఇరిగేషన్ అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఒత్తిడి మేరకు రేపో మాపో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలంటూ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా