దివ్యాంగులకు చంద్రబాబు వద్ద చేదు అనుభవం

20 May, 2018 10:41 IST|Sakshi

చట్ట సభల్లో అవకాశం కల్పించాలంటూ వినతి

గొంతెమ్మ కోర్కెలు అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి

తాడేపల్లి రూరల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు శనివారం ఉదయం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఉదయం 11 గంటల వరకు కరకట్టపైనే మండుటెండలో వేచి ఉన్నారు. చివరకు సీఎంతో మాట్లాడేందుకు ముగ్గురు ప్రతినిధులకు అవకాశం ఇచ్చారు. వారు సమస్యలను పూర్తిగా విన్నవించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ దివ్యాంగులందరికీ సమానంగా రూ.3,000 పింఛను ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒక్క దివ్యాంగుడు కూడా చట్టసభల్లో లేరని, రాబోయే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.. అని వ్యాఖ్యానించారని ఒక దివ్యాంగుడు వాపోయాడు. ఈనెల 27 నుంచి జరగనున్న టీడీపీ మహానాడులో దివ్యాంగుల సమస్యలపై చర్చించాలని కోరినట్టు తెలిపారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలి జోజిబాబు, వనమా బాబూరావు, వి.దుర్గారావు, సర్వేశ్వరరావు, రమేష్, ఎస్‌.కె.జిలాని, కొమ్మూరి రాధాకృష్ణ, ఏసుగంటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు