అయ్యో.. పాపం!

15 Sep, 2019 08:50 IST|Sakshi
మృతశిశువును పరిశీలిస్తున్న ఏఎన్‌ఎం పద్మ, బిడ్డను కోల్పోయిన జ్యోతి

మన్యంలో ఆగని ప్రసవ మరణాలు

తరచూ సంభవిస్తున్న ఘటనలు

పురిటినొప్పులతో కాలినడకన ఆస్పత్రికి పయనమైన గర్భిణి

మార్గమధ్యంలో మృత శిశువు జననం

పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆ తల్లి కన్న కలలు ఆవిరయ్యాయి. భూమి మీద పడకుండానే.. లోకాన్ని చూడకుండానే బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తొమ్మిది నెలలు మోసిన మాతృమూర్తి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘోరం పాడేరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. రహదారి లేని కారణంగా కాలినడకన ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నంలో బిడ్డ చనిపోయి జన్మించాడు. ఇలాంటి సంఘటనలు మన్యంలో తరచూ జరుగుతున్న పాపానికి గత పాలకుల నిర్వాకమే కారణమని ప్రజలు మండిపడుతున్నారు.

సాక్షి, పాడేరు రూరల్‌ : మన్యంలో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు నేటికీ కష్టాలను అనుభవిస్తున్నారు. కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వీరికి శాపంగా మారింది. దీంతో కొన్నాళ్లుగా మన్యంలో మాతాశిశు మరణాలు ఆగటం లేదు. తాజాగా పాడేరు మండలం వై.సంపలలో గర్భిణి వంతాల జ్యోతి ప్రసవ వేదనకి గురై ప్రసవ సమయంలో తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. వంతాల జ్యోతి నాలుగోసారి గర్భం దాల్చింది. నెలలు నిండడం శనివారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మినుములూరు పీహెచ్‌సీ, ఏఎన్‌ఎం పద్మకు సమాచారం ఇచ్చారు. అయితే వై.సంపల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేదు. దీంతో జ్యోతిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. డోలిలో తరలించేందుకు కూడా రహదారి సరిగ్గా లేదు. అలాగే చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులు నిండు గర్భిణి జ్యోతిని  అడవి మార్గం మీదుగా కాలినడకన పాడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మగబిడ్డను ప్రసవించింది. కానీ కాలినడకన సుమారు 5 కిలోమీటర్ల మేర నడవడంతో బిడ్డ చనిపోయి పుట్టాడు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్‌ కూడా సగం వరకూ వెళ్లి   ఆగిపోయింది. ఏఎన్‌ఎం పద్మ అక్కడకు వెళ్లి వైద్య సేవలందించారు. గత పాలకులు తమ గ్రామానికి రోడ్డు నిర్మంచలేదని వై.సంపల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 మన్యంలో మాతాశిశు మరణాల్లో కొన్ని...
- అనంతగిరి మండలంలో గత ఐదు రోజుల వ్యవధిలో ఐదుగురు శిశులు, ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోయారు.

-రెండు రోజుల క్రితం పాడేరు మండలం లగిసపల్లి గ్రామానికి చెందిన మూడు నెలల శిశువు మృతి చెందింది.

-గత 10 రోజుల వ్యవధిలో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరి, మండలాల్లో తొమ్మిది మంది శిశువులు, ఐదుగురు గర్భిణులు మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు