శివారు.. కష్టాలు శివాలు..!

18 Feb, 2015 02:14 IST|Sakshi

శివారు గ్రామాల్లో సమస్యల తిష్ట
అధ్వానంగా మారిన డ్రెయిన్లు
అస్తవ్యస్తంగా రహదారులు
పట్టించుకోని పాలకులు..
బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు
 

విజయవాడ సెంట్రల్/   రామవరప్పాడు : స్వచ్ఛభారత్.. స్మార్ట్ విలేజ్‌లు.. అంటూ ఆదర్శపాఠాలు వల్లెవేస్తున్న పాలకులకు శివారు గ్రామాల సమస్యలు మాత్రం కనిపించడం లేదు. కాలుష్యం కాటేస్తోంది బాబోయ్.. అని జనం గగ్గోలుపెడుతున్నా వినిపించడంలేదు. అధ్వానంగా మారిన డ్రెయిన్లు, రోడ్ల మీదుగానే పాలకులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో అనుకుంటే పొరపాటే... రాజధాని నగరం విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామాల్లోనే ఈ దుస్థితి నెలకొంది. శివారు గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అంతర్గత  రహదారులు అధ్వానంగా మారాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఆనుకుని ఉన్న డ్రెయిన్లలో మురుగు మేట వేసింది. తోపుడు బండ్ల వ్యాపారులు చెత్తాచెదారాన్ని డ్రెయిన్లలో వేస్తున్నా వారిని అడ్డుకునేవారు గానీ, డ్రెయిన్లు శుభ్రంచేయించేవారు గానీ లేరు. వర్షం కురిస్తే జాతీయ రహదారిపై నుంచి వర్షపు నీరు డ్రెయిన్లలోకి చేరి మురుగు పొంగిపొర్లుతోంది. వర్షాకాలం వస్తుందంటేనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
 
కాలుష్య కాసారం.. గుంటుతిప్ప డ్రెయిన్


గుంటుతిప్ప డ్రెయిన్ కాలుష్య కాసారంలా మారింది. ఈ డ్రెయిన్ ఆటోనగర్ నుంచి ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల మీదుగా రైవస్ కాలువలోకి కలుస్తుంది. నగరంలో నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను ఈ డ్రెయిన్‌లో కలుపుతున్నారు. ఆటోనగర్‌లోని పరిశ్రమల రసాయనాలు, వ్యర్థాలు కూడా దీనిలోనే కలుస్తున్నాయి. డ్రెయిన్ వల్ల ప్రసాదంపాడు,  రామవరప్పాడు గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రసాదంపాడు కార్మికనగర్‌లో ఇటీవల వేసిన బోరు, చేతిపంపుల నుంచి రసాయనాల వాసనతో కూడిన నీరు వస్తోందని ఈ ప్రాంతవాసులు వాపోతున్నారు. దీనిలోని నీరు తాగిన పశువులు రోగాల బారినపడుతున్నాయి. కొన్ని మరణిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ డ్రెయిన్ పొంగి సమీపంలోని ఇళ్లలోకి మురుగు చేరుతోంది. ఈ డ్రెయిన్ పరిసర ప్రాంతాల ప్రజలు బోరు నీరు తాగేందుకు సాహసించడంలేదు. మినిరల్ వాటర్ కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది.
 
శివారు గ్రామాల్లో ముఖ్య సమస్యలు ఇవీ..

రామవరప్పాడు, కరెన్సీనగర్‌కు మధ్య ఉన్న డ్రెయిన్ చిన్నసైజు కాలువలా తయారైంది. దీంతో ప్రజలకు ఏళ్ల తరబడి ఇక్కట్లు తప్పడం లేదు.
 
ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. వర్షాకాలంలో మోటారు బోర్ల సహాయంతో మురుగునీటిని తోడాల్సిన దుస్థితి నెలొంది.
 
జాతీయ రహదారి వెంబడి నిడమానూరు, రామానగర్ డ్రెయిన్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. గూడవల్లిలోనూ ఇదే పరిస్థితి.
 
రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న సాల్వెంట్ రోడ్డు దారుణంగా ఉందని స్థానికులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
 
పోరంకి రోడ్డులోని ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్ మరుగుదొడ్డి నీరు, భోజనశాల వ్యర్థాలను పంట కాలువలో కలిపేస్తున్నారు.  
 
ఓ కార్పొరేట్ విద్యాసంస్థ నిర్వాహకులు నిడమానూరు పంచాయతీ స్థలంలో తూములు ఏర్పాటుచేసి బుడమేరు కాలువలో వ్యర్థాలు కలుపుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు అయ్యాయి.

మరిన్ని వార్తలు