బడికొస్తా..బంక్‌ కొట్టింది

29 Oct, 2018 11:50 IST|Sakshi

రెండేళ్లుగా సైకిళ్ల పంపిణీ జరగక

విద్యార్థుల్లో నిరాశ ఏటా పెరుగుతున్న డ్రాపౌట్స్‌        

‘బాలికలపై తల్లిదండ్రులు వివక్ష చూపొద్దు.. బాలికా విద్యను ప్రోత్సహించాలి.. ఒక్క బాలిక కూడా మధ్యలో చదువు మానడానికి వీల్లేదు.. బాలికల విద్యాభివృద్ధికి ఎంత ఖర్చయినా భరిస్తాం’.. ఇది మన ప్రభుత్వం నుంచి తరచూ వచ్చే ప్రకటన. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం. బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి ప్రవేశపెట్టిన బాలికలకు సైకిళ్లు అందించే ‘బడికొస్తా’ పథకం రెండేళ్లుగా పత్తాలేకుండాపోవడమే ఇందుకు నిదర్శనం.

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : రాష్ట్రం ప్రభుత్వం 2016–17లో 9వ తరగతి బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేసింది. ఆ తరువాత పథకం గురించి పట్టించుకోకపోవడంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థినులకు బడికి రాకపోకలు కష్టంగా మారాయి. ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేస్తుందని ఆశించిన విద్యార్థినులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 506 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 1.20 లక్షల మందికి పైగా 9, 10 తరగతుల విద్యార్థినులు ఉన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం బడికొస్తా పథకాన్ని ప్రవేశపెట్టగా, 17 విద్యాసంవత్సరం ముగిసే సమయంలో కొంతమందికి మాత్రమే సైకిళ్లను అందజేసి చేతులు దులుపుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకు పంపిణీ చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయినా సైకిళ్లను పంపిణీ చేయకపోవడంతో.. విద్యార్థినుల్లో ఆశలు సన్నగిల్లాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన డ్రాపౌట్స్‌..
గ్రామీణ విద్యార్థినులకు ఉన్నత పాఠశాలలు దగ్గరలో లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు నడచి వెళ్లలేక డ్రాపౌట్స్‌గా మిగులుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 19 వేల మందికి పైగా బడిమానేసిన వివిధ తరగతుల బాలికలు ఉన్నట్లు సమాచారం.

విద్యార్థినులకు తప్పని కష్టాలు..
పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వచ్చిపోయే విద్యార్థినులు రోజూ 3 నుంచి 10 కిల్లోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీలోని ఆవులపల్లె నుంచి చెంబకూరుకు రావాలంటే 7 కిల్లోమీటర్లు కాలినడకన అడవిలో ప్రయాణం సాగించాల్సి ఉంది. వన్యమృగాలు తారసపడడం, వాటి అరపులతో భయభ్రాంతులకు గురై కొందరు స్కూలుకు వెళ్లడం మానేస్తున్నారు. సరిౖయెన సమయానికి స్కూలుకు పోలేని విద్యార్థినులు అనేకమార్లు గైర్హాజరై పరీక్షల సమయంలో హాజరు తక్కువతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది.

సైకిళ్ల పంపిణీకి ఉత్తర్వులివ్వలేదు..
గ్రామీణ ప్రాంతాల్లో బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి సైకిళ్ల పంపిణీ ఎంతగానో దోహదపడుతుంది. బడికొస్తా పథకం అమలుకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.
– పాండురంగస్వామి, డీఈఓ, చిత్తూరు 

మరిన్ని వార్తలు