నడిచే బడికొస్తా

9 Oct, 2018 12:55 IST|Sakshi

ఏడాది ముచ్చటగా ‘బడికొస్తా’ పథకం

అటకెక్కిన బాలికల సైకిళ్ల పంపిణీ  

మూడేళ్లుగా అమలు.. ఒక్క ఏడాదే పంపిణీ

ఈసారి 8, 9 తరగతి వారికి ఇస్తామని ప్రకటన

ఇప్పటిదాకా అతీగతీ లేని వైనం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడికొస్తా’ పథకం ఏడాది ముచ్చటగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే బాలికలు.. దూరం కారణంగా బడిమానివేయకూడదనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావించింది. ఏటా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ 2016–17 విద్యాసంవత్సరానికి మాత్రమే పంపిణీ చేసి...ఆ తర్వాత పట్టించుకోలేదు. 

15,388 సైకిళ్లు పంపిణీ
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు  ‘‘బడికొస్తా’’ సైకిళ్లు పంపిణీ చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంబరపడ్డారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు డ్రాపౌట్స్‌గా తగ్గించవచ్చనుకున్నారు. అయితే ప్రభుత్వం ఒక్క ఏడాది మాత్రమే పంపిణీ చేసి తర్వాత పట్టించుకోలేదు. జిల్లాకు 2016–17లో 15,581 సైకిళ్లు మంజూరయ్యాయి. వీటిలో 15,388 మంది బాలికలను సైకిళ్లు పంపిణీ చేశారు. వివిధ కారణాల వల్ల బడికి రాని కారణంగా 193 సైకిళ్లు అధికారుల వద్దే మిగిలిపోయాయి. ఆ తర్వాత 2017–18 సంవత్సరంలో పంపిణీ చేయలేదు. 17,388 సైకిళ్లు అవసరం అని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాలికలు, వారి తల్లిదండ్రులు సైకిళ్లు కోసం ఎదురుచూశారు. జిల్లా అధికారులు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది... అదిగో... ఇదిగో ఉంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం  ఒక్క సైకిలూ పంపలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2018–19) దాదాపు సగం గడిచిపోతున్నా ఇప్పటిదాకా స్పష్టత లేదు.  
8వ తరగతి విద్యార్థినులకూ...  
గత రెండేళ్లలో ఒకసారి మాత్రమే సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులతో పాటు 8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించింది. స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలు సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల నుంచి 8, 9 తరగతుల విద్యార్థినుల వివరాలు సేకరించారు. జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు బాలికలు ఉన్నారు. తరచూ మీడియాలో వస్తున్న ప్రకటనలతో వారంతా సైకిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ
సైకిళ్లు సరఫరా చేసే టెండరును రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ దక్కించుకుంది. స్కూల్‌ పాయింట్‌కు చేర్చాల్సిన బాధ్యత వారిదే. అయితే రాష్ట్రం నుంచి జిల్లా కేంద్రానికి ఇక్కడి నుంచి మండలం, అక్కడి నుంచి స్కూల్‌ పాయింట్‌కు చేర్చడంలో మరింత జాప్యం జరిగింది. దీనికితోడు సైకిళ్లు నాణ్యత కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు.  

ప్రచార ఆర్భాటం
ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అంతా ప్రచార ఆర్భాటం. అందుకే అమలు గురించి పట్టించుకోవడం లేదు. మూడేళ్లలో ఒక్కసారి ఇచ్చేసి చేతులెత్తేశారు. ఈ ఒక్కటే కాదు.. విద్యాభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రభుత్వ విద్య కుంటు పడుతోంది.   – కె.ఓబుళపతి, వైఎస్సార్‌టీఎఫ్‌రాష్ట్ర ప్రధానకార్యదర్శి

నాకు తెలీదు
బడికొస్తా పథకం ద్వారా ఈ సారి 8, 9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాకు సుమారు 30 వేలుకు పైగా సైకిళ్లు అవసరం. ప్రతిపాదనలు పంపాం. ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయం. ఇంతకు మించి నాకు తెలీదు.– జనార్దనాచార్యులు, జిల్లా విద్యాధికారి

మరిన్ని వార్తలు