అటకెక్కిన బడికొస్తా పథకం

8 Oct, 2018 07:22 IST|Sakshi
గత ఏడాది అందించిన సైకిళ్లతో విద్యార్థినులు(ఫైల్‌)

విద్యార్థినులకు అందని సైకిళ్లు

ఉత్తర్వులు రాలేదంటున్న విద్యాశాఖాధికారులు

తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు చూపెడుతున్న శ్రద్ధ వాటిని కొనసాగించడంలో మాత్రం విస్మరిస్తోంది. ఫలితంగా అనేక కార్యక్రమాలు ఆరంభ శూరత్వంలా మిగిలిపోతున్నాయి. ఇప్పటికే అనేక పథకాలకు మంగళం పాడేసిన టీడీపీ సర్కారు.. తాజాగా ‘బడికొస్తా’ పథకం కొనసాగింపులో కూడా అదే వైఖరి అవలంబిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడిచినా విద్యార్థినులకు ఇంతవరకూ సైకిళ్లు పంపిణీ చేయలేదు.

శ్రీకాకుళం, ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బడికొస్తా పథకం పడకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో 2017 ఏప్రిల్‌ 16న ఈ పథకం ప్రవేశపెట్టారు. ప్రతి మండల కేంద్రం, మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అప్పట్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లావ్యాప్తంగా 56 వేలుసైకిళ్లు పంపిణీ చేశారు. 2016–17లో తొమ్మిదో తరగతి చదివిన విద్యార్థులకు మాత్రమే వీటిని అందజేశారు. తర్వాత పథకాన్ని పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరంతా దూరప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి వస్తున్నారు. మరికొందరు కాలిబాటన కిలోమీటర్ల మేర నడుస్తూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇంకొందరు పాత సైకిళ్లపై వస్తున్నారు. నాలుగు నెలలుగా కొత్త సైకిళ్ల కోసం ఎదురుచూస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 450 జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో సైకిళ్లు అందుకునేందుకు అర్హహ కలిగిన విద్యార్థినులు సుమారు  54,000 మంది ఉన్నారు. బడికొస్తా పథకం కోసం ఎవరిని అడిగినా సరైన సమాధానం ఉండటం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సైకిళ్లు అందిస్తే కాస్త భరోసాగా ఉంటుందని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. బడికొస్తా పథకం అమలుకు తమకు ఎటువంటి ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ రాలేదని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సైకిళ్లు ఇస్తారా.. లేదా అన్న అంశంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

సైకిళ్ల కోసం ఎదురుచూపు..
ప్రభుత్వం గత ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు  బడికొస్తా పథకం కింద సైకిళ్లు ఉచితంగా అందించారు. ఈ ఏడాది మాకు అందిస్తారని ఎంతగానో ఎదురుచూశాం. అయినా ఇప్పటివరకు ఏ ప్రకటనా లేదు.
– జొన్నాడ ప్రియాంక, విద్యార్థిని,ఆమదాలవలస

మరిన్ని వార్తలు