డిప్యూటీ కలెక్టర్‌.. పీవీ సింధు

10 Aug, 2017 03:26 IST|Sakshi
డిప్యూటీ కలెక్టర్‌.. పీవీ సింధు

విధుల్లో చేరిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి
శిక్షణ కోసం కృష్ణా జిల్లాకు కేటాయింపు


సాక్షి, అమరావతి: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్‌ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఆమె బుధవారం శుభఘడియల్లో విధుల్లో చేరారు. సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్ర పునేతా సెలవులో ఉండటంతో సీసీఎల్‌ఏ జాయింట్‌ కమిషనర్‌ జగన్నాథం, సీసీఎల్‌ఏ కార్యదర్శి రామారావులకు ఆమె జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెకు నియామక పత్రాన్ని అందజేసిన విషయం విదితమే. సీసీఎల్‌ఏకు వచ్చిన సందర్భంగా అక్కడి ఉద్యోగులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు.

గోపీచంద్‌ అకాడమీలో మంచి శిక్షణ పొందుతున్నానని, రాబోయే ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో విజయం సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. సింధు విజ్ఞప్తి మేరకు సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్ర పునేత ఆమెను శిక్షణ నిమిత్తం కృష్ణా జిల్లాకు కేటాయించారు. కృష్ణా జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతంకు బుధవారం సాయంత్రం రిపోర్టు చేశారు. సింధు వెంట ఆమె తండ్రి రమణ ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ విధులు, బాధ్యతలపై ఆమె కృష్ణా జిల్లాలో శిక్షణ పొందనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

సింధుకు వైద్య ధృవీకరణ పత్రాలు
విధుల్లో చేరే ముందు పీవీ సింధుకు వైద్యవిద్యా సంచాలకులు వైద్య ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటే నిబంధనల ప్రకారం మెడికల్‌ బోర్డు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల సింధు బుధవారం తన తండ్రితో కలసి వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయానికి  వచ్చారు. ఆమెకు వైద్య విద్య సంచాలకులు డా.ఎన్‌.సుబ్బారావు, అకడెమిక్‌ వైద్యవిద్యా సంచాలకులకు డా.కె.బాబ్జీ సాదర స్వాగతం పలికారు. సింధుకు సిద్ధార్థ వైద్య బృందం పరీక్షలు చేశారు.

మరిన్ని వార్తలు