పందేలకు నై! 

12 Jan, 2020 12:08 IST|Sakshi
రామానుజపురంలో బరులను ధ్వంసం చేస్తున్న పోలీసులు

పోలీసుల బైండోవర్‌ పంజా 

కోడికత్తులు స్వాదీనం

పలువురిపై కేసులు నమోదు 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంప్రదాయం పేరుతో సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సన్నద్ధం అవుతున్నారు. కోడిపందేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉండటంతో వాటిని అడ్డుకునేందుకు పోలీసులు బైండోవర్‌ కేసులతో ముందుకు వెళ్తున్నారు. అయినా పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. ఇప్పటివరకు జిల్లాల్లో సుమారు 638 కేసులు నమోదు చేయగా, 2,730 మందిపై బెండోవర్‌ కేసులు పెట్టి కోడి కత్తులు స్వా«ధీనం చేసుకున్నారు. గతనెల 14 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఏలూరు సబ్‌డివిజన్‌లో 276 మందిపై 81 కేసులు, కొవ్వూరు సబ్‌డివిజన్‌ పరిధిలో 520 మందిపై 144 కేసులు, నరసాపురంలో 1,611 మందిపై 309 కేసులు, జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో 188 మందిపై 54 కేసులు, పోలవరం సబ్‌డివిజన్‌ పరిధిలో 135 మందిపై 50 కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈసారి భారీగా పందేలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. సంక్రాంతి పండగకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో జిల్లావ్యాప్తంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కూడా ఇవ్వడంతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గుట్టుగా బరులు సిద్ధం :
పెద్ద సంఖ్యలో  పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ ఇతర క్రీడాపోటీలు అంటూ బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా పోలీసుల కళ్లుకప్పి పందేలు మొదలయ్యాయి. కోడిపందేల నేపథ్యంలోనే పెదవేగి ఎస్సైపై జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ వేటు వేయడంతో మిగిలిన అధికారుల్లో భయం మొదలైంది. దీంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బైండోవర్‌ కేసులను నమోదు చేశారు.  కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన భీమవరంతో పాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో  పలు గ్రామాల్లో సంక్రాంతి కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. గతంలో పందేలు జరిగిన గ్రామాల్లో పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు, గ్రామసభలు నిర్వహించి పందేలు, జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరి పని వారిది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పోలీసుల బైండోవర్‌ కేసుల పేరుతో అడ్డుకున్నా చివరి నాలుగురోజులు అనుమతులు వస్తాయన్న నమ్మకంతో పందేల నిర్వాహకులు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు