త్యాగం, సహకారంతో ప్రశాంత జీవనం

23 Aug, 2018 12:38 IST|Sakshi
కడప : బిల్టప్‌ వద్ద ఉన్న ఈద్గాలో సామూహిక ప్రార్థనలు (ఇన్‌సెట్‌) బక్రీద్‌ సందేశాన్ని ఇస్తున్న హజరత్‌ ముఫ్తీ న్యామతుల్లా సాహెబ్‌

కడప కల్చరల్‌ : ముస్లింలకు ఆరాధనీయమైన పండుగ బక్రీద్‌ను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు 12 గంటల వరకు కొనసాగాయి. కడపలోని బిల్టప్‌ వద్దగల ఈద్గాలో నగర వాసులతోపాటు సమీప గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముఫ్తీ మహమ్మద్‌ న్యామతుల్లా సందేశమిస్తూ మనుషుల్లో త్యాగ గుణం పెరగాలని, సాటి మనుషులతో పరస్పరం సహకరించుకుంటూ ఉన్నప్పుడే ప్రశాంత జీవనం, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా తా ము శుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దైవం సూచించారన్నారు.

కేరళలో జల విలయం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బా«ధ్యత సాటి మనుషులుగా మనపై ఉందని పేర్కొన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్‌ ఖ్వాజా సయ్యద్‌ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్‌ భక్తులతో సామూహిక ప్రార్థనలు చేయించారు. భక్తులు ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్‌ ముబారక్‌ హో’అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఆరీఫుల్లా, డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, హరిప్రసాద్, నగర ముస్లిం ప్రముఖులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, నాసర్‌ అలీ, పెద్దదర్గా ప్రతినిధి నయీంతోపాటు నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓఎస్‌డీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ పర్యవేక్షణలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు రక్షణ చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు