వెండి తెరపై 'విశాఖ' వెన్నెల

20 Dec, 2014 12:39 IST|Sakshi
వెండి తెరపై 'విశాఖ' వెన్నెల

బాలచంద్రుడు వెండితెరపై విశాఖ వెన్నెల కురిపించాడు. అంతవరకూ తెలుగు, తమిళ చిత్రాలలో మద్రాసు మెరీనా బీచ్ మెరిసిపోయేది. 36 ఏళ్ల క్రితం 1978లో తమిళ దర్శక దిగ్గజం కె. బాలచందర్ అంతకన్న రమణీయంగా వైజాగ్ సాగర తీరాన్ని సెల్యులాయిడ్‌పై బంధించి 'మరోచరిత్ర'ను సృష్టించి వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.
 
మరోచరిత్ర షూటింగ్ నాటికి స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి కాలేదు. ప్లాంట్ శంకుస్థాపన పైలాన్ దగ్గర నిల్చుని హీరో హీరోయిన్లు కమల్ హాసన్, సరిత మధ్య సంభాషణ ఇలా ఉంటుంది..'మన ప్రేమ ఎప్పుడు ఫలిస్తుంది..' అని కథానాయిక అడిగితే 'విశాఖలో స్టీల్ ప్లాంట్ పూర్తయినప్పుడు' అని హీరో అంటాడు. గణేశ్ పాత్రో రాసిన ఈ డైలాగ్ వింటే విశాఖకు ఈ సినిమాలో దర్శకుడు ఇచ్చిన ప్రాధాన్యం చెప్పకనే  చెబుతుంది. ఆర్కే బీచ్ తీరం, యారాడ కొండ, భీమిలి సాగరతీరం..ఇలా వైజాగ్ ప్రకృతి సోయగాలన్నిటినీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిపించారు.


ఏ ముహుర్తాన బాలచందర్ విశాఖ సమగ్ర సుందరంగా బీఎస్ లోక్‌నాథ్ కెమెరా ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారో కాని, ఆనాటి నుంచి ఎన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొన్నాయి. మరో చరిత్రను హిందీలో 'ఏక్ దుజేకేలియే'గా పునర్నిర్మించినపుడు సైతం బాలచందర్ విశాఖ వచ్చి ఇక్కడే షూటింగ్ జరిపారు. విశాఖను పూర్తిస్థాయిలో సిల్వర్ స్క్రీన్‌పై చూపిన మరో చరిత్ర ముచ్చట్లను  చిత్ర సహాయ దర్శకుడు ఎస్‌కె.మిశ్రో  సిటీప్లస్‌తో  పంచుకున్నారు.
 
బాలచందర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. మరో చరిత్ర చిత్ర నిర్మాణానికి విశాఖ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని భావించిన బాలచందర్ 1978లో తన బృందంతో ఇక్కడ షూటింగ్ స్పాట్స్‌ను చూడాలని వచ్చారు. సంభాషణల రచయిత గణేశ్ పాత్రో చొరవతో మా టీమ్ బాలచందర్ సమక్షంలో రెండు నాటికాలు ప్రదర్శించాం. అందరిలోనూ నా నటన ఆయనకు నచ్చి సినిమాకు సహాయ దర్శకుడిగా ఉంటూ ఓ పాత్ర కూడా నటించాలని అడిగారు.

అప్పటికి పోర్టు ఉద్యోగినైన నాకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు కదా .. అని అడిగిమరీ నన్ను ఆహ్వానించారు.  బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా ఉన్న ఈరంకి శర్మ పూర్తి స్థాయిడైరక్టర్‌గా మారారు. నా కోసమే అన్నట్లుగా ఆ స్థానం ఖాళీగా ఉంది.  ఆ రోజు నుంచే  ఆర్కే బీచ్,  రుషికొండ,  భీమిలి ప్రాంతాలలో ఉన్న షూటింగ్ స్పాట్‌లన్నిటికీ కార్లో తిప్పారు. ఇక్కడే పుట్టి పెరిగినా విశాఖ గురించి పెద్దగా నాకు తెలియదు. ‘విశాఖను నేను మీకు చూపిస్తున్నానా..లేదా మీరు నాకు చూపెడుతున్నారా..’ అని బాలచందర్  నాతో అన్నారు. సిటీలో ఉన్న బ్యూటీఫుల్ స్పాట్స్‌ను ఐడెంటీఫై చేయటంలో ఆయన చొరవ నన్ను ఆశ్చర్యపరిచేది.

ఆయన ఎంచుకున్న స్పాట్స్‌లోనే చకచకా షూటింగ్ జరిగిపోయింది.  ఆర్కే బీచ్ వద్ద చిన్న సముద్రజీవి కనపడినా దానిని షూట్‌ఇట్ అంటూ బాలచందర్ ఫొటోగ్రాఫర్‌ను తొందర చేసేవారు. నటీ నటులు, సాంకేతిక బృందానికి సీన్ అర్థమయ్యేట్లు వివరించేవాణ్ణి. అప్పటికే  కమల్ హాసన్‌కు స్టార్‌డమ్ వచ్చింది. ఆయనకు డైలాగ్ ఒక్కటే చెప్పండి చాలు మాడ్యులేషన్ చెప్పక్కర్లేదు అని బాలచందర్ అన్నారు. కమల్‌పై ఆయనకున్న నమ్మకం అలాంటిది.     ఎంత పెద్ద తెలుగు డైలాగ్ అయినా రెండుసార్లు చెబితే చాలు చక్కగా పలికేవారు.

ఈ సినిమాను విషాదాంతం చేయటమే కాదు..మొదటి సీన్లోనే క్లైమాక్సు  ఏమిటో ప్రేక్షకులకు తెలిసేలా చేసి సస్పెన్స్ దాచకుండా చేసిన ధైర్యం బాలచందర్‌ది..సార్   మొదట్లోనే ఈ సీన్ పెట్టడం బావుండదేమో అని ధైర్యంగా నేను ఆయన వద్ద ప్రస్తావిస్తే నవ్వుతూ .. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూసిన ప్రేక్షకుడు ఎలాగూ బయట చెప్పేస్తాడు. ఇంక మనం దాచి ఏం ప్రయోజనం. పైగా ఇది ట్రాజెడీ అని ముందే చెప్పేస్తే అందుకు ప్రిపేర్ అవుతాడుగా అన్నారు.

తాను అనుకున్నట్టే సినిమా తీసి ఘన విజయం సాధించారు. అందమైన అనుభవం సినిమాలోనూ ఏక్‌దుజేకేలియే, మరో తమిళ్ చిత్రంలోనూ నాకు నటించే అవకాశమిచ్చారు. అప్పట్లో అప్సర (గ్రీన్ పార్క్) హొటల్ మకాం ఉన్న బాలచందర్ తరువాత డ్యూయెట్ సినిమా షూటింగ్ టైమ్‌లోనూ ఇక్కడికి వచ్చి డాల్ఫిన్‌లో ఉన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఒక పాట వినిపించేందుకు అప్పుడు ఇక్కడికి వచ్చారు.  
 
 చిన్నపాత్ర అయినా చిరస్మరణీయం

వచ్చే జనవరి4న 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మిశ్రో 'నీడలేని ఆడది' సినిమాతో సినీ జీవిత ప్రస్థానం ప్రారంభించి దాదాపు 60 సినిమాల్లో నటించారు. బాలచందర్ మరోచరిత్రను విశాఖలో చిత్రీకరించటంతో మిశ్రోకు మహత్తర అవకాశం లభించింది. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించటమే కాకుండా ఆ సినిమాలో చక్కటి పాత్రలో జీవించారు. సాగర సంగమంలో విశ్వనాథ్ దర్శకత్వం లో మిశ్రో చేసింది చిన్న పాత్రే అయినా నేటికీ చిరస్మరణీయమైనదే. సిరివెన్నెల చిత్రంలో హీరో తాత వేషం, భాగవతం టీవీ సీరి యల్‌లో శకుని వేషం వేశారు.
 

మరిన్ని వార్తలు