కడపలో బాలయ్య సందడి

4 Apr, 2014 02:47 IST|Sakshi

 కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ‘నాన్న ఎన్టీఆరే అసలైన లెజెండ్. అటు సినిమా రంగంలో అనేక సంచలనాలు.. ఇటు రాజకీయ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం ఆయన లెజండరీకి నిదర్శనం’ అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తను నటించిని లెజెండ్ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న కడపలోని రవి థియేటర్‌కు దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలసి బాలయ్య గురువారం ఇక్కడికి వచ్చారు.
 
 సాయంత్రం 4 గంటలకు ఆయన నేరుగా  థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. తమ కుటుంబం మొదటి నుంచి సేవాగుణం కలిగినదన్నారు. రాజకీయాల ద్వారా ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు ధరించి సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన స్ఫూర్తితో సినీ రంగంలో సందేశాత్మక పాత్రలతో రాణిస్తున్నామని, విభిన్నమైన పాత్రలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. తన నటించిన లెజెండ్ సినిమా ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రార్థనా మందిరాలను దర్శిస్తున్నామని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు సందేశాత్మక చిత్రాలను, అభిమానులందరినీ ఆనంద పరిచే సినిమాలను చేస్తానని ప్రకటించారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు పీరయ్య, థియేటర్ ప్రతినిధులు అమానుల్లా, రవీంద్రనాథ్‌రెడ్డి, కొండారెడ్డి, హరిప్రసాద్, దామోదర్‌రెడ్డి తదితరులు అభిమానులతో కలసి బాలకృష్ణకు గజమాల అలంకరించారు.
 
 దర్గా గురువుల దర్శనం
 అనంతరం ఓపెన్ టాప్ జీపులో బాలకృష్ణ పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆశీస్సులు పొందారు. దర్శనం సమయం కాకపోవడంతో దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద పూలచాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత దర్గాలోని ఇతర గరువుల మజార్లనూ దర్శించుకుని, ప్రార్థించారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, నగర అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్, ఇనాయతుల్లా  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు