పార్టీ మారినవారు రాజీనామా చేస్తారు

25 Feb, 2016 02:36 IST|Sakshi
పార్టీ మారినవారు రాజీనామా చేస్తారు

సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రెండురకాలుగా స్పందించారు. వారు రాజీనామా చేస్తారని తొలుత పేర్కొన్న ఆయన ఆ తర్వాత మాటమార్చుతూ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసమే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ మారిన వారిని రాజీనామా చేసి తిరిగి గెలవాలన్న విపక్షం డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ..

వారు రాజీ నామా చేస్తారని చెప్పారు. అయితే పక్కనున్న నేతలు చెవిలో గుసగుసలాడడం తో బాలకృష్ణ సర్దుకుని ఎందుకు రాజీనామా చేయాలని విలేకరుల్ని ప్రశ్నించారు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదని చెప్పిన ఆయన అలాంటి వారిని నెత్తినెక్కించుకోనని పరోక్షంగా చెప్పారు. సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో వారినే పిలిచానని, ఎవరిని పిలవాలో తనకు తెలుసన్నారు.

తన పక్కన గ్లామర్ ఉన్నవాళ్లు ఉన్నారని, వారి తోనే ప్రయాణిస్తానన్నారు. ఎవరినీ నెత్తినెక్కిం చుకోనని, అలాంటి వాళ్లను పిలవనని చిరంజీవి గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానన్నారు. కాగా, లేపాక్షి నంది ఉత్సవాలను యునెస్కో సంస్థ పరిధిలోకి చేర్చడానికి కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపినట్టు బాలకృష్ణ తెలిపారు.
 

మరిన్ని వార్తలు