-

ఒకరు బాలకృష్ణ..మరొకరు ఎవరో?!

21 May, 2014 08:40 IST|Sakshi
ఒకరు బాలకృష్ణ..మరొకరు ఎవరో?!

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు ఇప్పటికే మంత్రివర్గంలో స్థానాన్ని ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా నుంచి మరొకరిని కూడా తీసుకునే అవకాశముంది. ఆ స్థానం కోసం పరిటాల సునీత (రాప్తాడు), కాలవ శ్రీనివాసులు(రాయదుర్గం), జేసీ ప్రభాకర్‌రెడ్డి(తాడిపత్రి), బీకే పార్థసారథి(పెనుకొండ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే.
 
 ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే మహానాడులో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రాష్ట్ర విభజనపై అపాయింటెడ్ డే తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు.
 
 గరిష్టంగా 26 మందికి  మాత్రమే స్థానం కల్పించవచ్చు. మన జిల్లా నుంచి టీడీపీ టికెట్‌పై 12 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మెజార్టీ సభ్యులు గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు  సముచిత ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. కనీసం రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటుడు నందమూరి బాలకృష్ణ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్టీఆర్ తనయుడు, తన వియ్యకుండైన బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు కీలకశాఖ దక్కే అవకాశముంది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో.. అదే సామాజికవర్గానికి చెందిన మరొక ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదని టీడీపీ వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.
 
 కాగా, రెండో బెర్తు కోసం పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీకే పార్థసారథి పోటీపడుతున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కాలవ శ్రీనివాసులు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. బీసీ వర్గానికి చెందిన కాలవకు ఆ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన పరిటాల సునీత తనకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని విశ్వసిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.
 
 అందులో ఒకరు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇంకొకరు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి. రెడ్డి సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తే.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకునే సమయంలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన జేసీ దివాకర్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కితే.. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఉండదు. కేంద్రంలో జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రి పదవి లభిస్తే... రాష్ట్ర మంత్రివర్గంలో పరిటాల సునీతకు స్థానం ఖాయమనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు