దేశభక్తిగల వాగ్గేయకారుడు బాలాంత్రపు

1 Feb, 2015 01:43 IST|Sakshi
దేశభక్తిగల వాగ్గేయకారుడు బాలాంత్రపు

విజయవాడ: దేశభక్తి, జాతీయభావం కలిగిన వ్యక్తి బాలాంత్రపు రజనీకాంతరావు అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడలో శనివారం నిర్వహించిన రజనీకాంతరావు వందో పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తన చిన్నతనంలో రజనీ రచించిన జేజిమామాయ్య పాటలు ప్రభావితం చేశాయని చెప్పారు. సంగీత కళాకారులపై ఆయన రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’ సంగీత ప్రపంచానికి ప్రామాణిక గ్రంథమని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలోను, భారత్-చైనా యుద్ధంలోను ఆయన రచించిన గీతాలు ప్రజల్లో దేశభక్తిని చాటాయని చెప్పారు. ‘నాదీ స్వతంత్ర దేశం.. నాదీ స్వతంత్ర జాతి’ ఇప్పటికీ గుర్తొస్తుందన్నారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రజనీకాంతరావు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ మోహన్‌కందా మాట్లాడుతూ రేడియోకి జవసత్వాలు కలిగించిన వ్వక్తి రజనీకాంతరావు అని, రజనీ లేని ఆకాశవాణిని ఊహించలేమని పేర్కొన్నారు. సంగీతం, రేడియో ఊపిరిగా బతికిన వ్యక్తి రజనీకాంతరావు అని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రజనీ ప్రకృతి ఆరాధకుడని, ప్రపంచమే ఆయన సంగీతమని చెప్పారు. సినిమాలకు సంగీతం సమకూర్చినా ఆయన రేడియో కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. గాయని రావు బాలసరస్వతి తదితరులు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు