వైఎస్సార్‌సీపీలో చేరిన బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు

14 Oct, 2013 00:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరు రఘురామ కృష్ణం రాజు, తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం విజయదశమి రోజు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కృషి చేయాల్సిందిగా జగన్ వారిని కోరారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి భారీగా అనుచరులు తరలివచ్చారు.
 
 సమైక్యాంధ్ర కోసం జగన్‌తో కలిశా: రఘురామ కృష్ణంరాజు
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే వైఎస్సార్‌సీపీలో చేరానని రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్ సూచనల మేరకే తాను పదిరోజుల క్రితం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశానన్నారు. అది దసరా సెలవుల తరువాత విచారణకు వస్తుందన్నారు. వచ్చే దసరా నాటికి సమైక్య రాష్ట్ర సీఎం పదవిలో జగన్ ఉంటారని విశ్వాసం వెలిబుచ్చారు. కోస్తాంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోని సమైక్యవాదులు కూడా జగన్‌కు మద్దతిస్తారన్నారు. జగన్ సాహసం, పట్టుదల కలిగిన నేత అని, అందుకే ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానన్నారు.
 
 జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం: బాలశౌరి
 వైఎస్సార్ మృతి చెందాక రాష్ట్రం అల్లకల్లోలమై పోయిందని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలంటే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని బాలశౌరి అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. విభజనకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ ను అలుసుగా తీసుకుని కాంగ్రెస్.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందని విమర్శించారు. రఘురామ కృష్ణంరాజుతోపాటుగా ఉండికి చెందిన నరసింహరాజు, బాలశౌరితోపాటుగా థామస్‌నాయుడు, దుర్గాప్రసాద్‌లు పార్టీలో చేరారు.
 
  కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే ఎం.సుచరిత, పార్టీ సీజీసీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎం.నాగార్జున, రావి వెంకటరమణ, రాతంశెట్టి రామాంజనేయులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎల్.అప్పిరెడ్డి, అనూప్ శేషగిరిరావు, రాజేంద్రప్రసాద్, షౌకత్, నసీర్ అహ్మద్, జి.చిన వెంకటరెడ్డి, ఎం.విజయలక్ష్మి, అనసూయ, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ిపి.సర్రాజు, గ్రంథి శ్రీనివాస్, జిల్లా నేతలు తోట గోపి, చీర్ల రాధయ్య, మల్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు