బలిజలను బీసీల్లో చేర్చేందుకు కృషి

27 Oct, 2014 02:24 IST|Sakshi
బలిజలను బీసీల్లో చేర్చేందుకు కృషి

 కడప అర్బన్ :
 బలిజ, తెలగ, ఒంటరి,కాపు కులస్తులను బీసీల్లో చేర్చేందుకు  కృషి చేస్తానని రాష్ట్ర హోంశాఖ మంత్రి చిన్న రాజప్ప అన్నారు. జిల్లాలో ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ విచ్చేశారు.  కడప నగర శివార్లలోని రాజీవ్ సృ్మతివనంలో రాష్ట్ర బలిజ, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీపీ నారాయణస్వామి అధ్యక్షతన బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బలిజ, కాపు, తెలగ కులస్తుల నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు  విచ్చేశారు.

ఈ సందర్భంగా చిన్న రాజప్ప మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కోస్తా జిల్లాలలో పర్యటించి బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులస్తులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు మొదట చట్టసభల్లో అవకాశం కల్పించారన్నారు. మండలి బుద్దప్రసాద్‌కు శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా, తనకు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవులు ఇచ్చారన్నారు.  శాసనసభ డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్ మాట్లాడుతూ  అనేక మంది బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులస్తులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు.  

ఈ మహాసభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కులస్తుల ఐక్యతను చాటామన్నారు.  కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌మేడా మల్లికార్జునరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ,  టీడీపీ నేతలు దుర్గాప్రసాద్, పసుపులేటి బ్రహ్మయ్య, ప్రసాద్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు  రాష్ర్ట హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌మండలి బుద్దప్రసాద్  శ్రీ విజయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు.

హోం మంత్రికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సింహపురికాలనీలోని న్యాయవాది జీఎస్ మూర్తి స్వగృహానికి వెళ్లారు. శంకరాపురంలోని బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీపీ నారాయణస్వామి ఇంటికి  వెళ్లి  అల్పాహారం స్వీకరించారు.

 హామీలు నెరవేరుస్తాం
 రైల్వేకోడూరురూరల్: ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, హోంశాఖా మంత్రి చినరాజప్ప అన్నారు. రైల్వేకోడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఉద్యాన రైతులకు కూడా రుణమాఫీ అయ్యే విధంగా కేబినెట్‌లో చర్చించామన్నారు.

మరిన్ని వార్తలు