మా ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తుంది:బాలినేని

17 Jul, 2019 19:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం నిర్వహించిన వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్‌ యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం కాం‍ట్రాక్ట్ ఉద్యోగుల కోసం సబ్ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీలో తాను కూడా సభ్యుడుగా ఉన్నానని, ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు వచ్చేలా కృషి చేస్తానని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందరి కష్టాలను తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ. 20 వేల కోట్లు అప్పు చేసిందని, విండ్, సోలార్, పవర్ పీపీఏల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించారు. హెచ్‌ఆర్‌ పాలసీ తెచ్చి ప్రత్యక్షంగా ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. 3 వేల మందితో ప్రారంభమైన యూనియన్‌ నేడు 25 వేలకు చేరుకుందని.. ఇందుకు కారుమురి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

అవినీతికి తావు లేదు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ  వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని తెలిపారు. సీఎం జగన్‌ పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకున్నారని.. తగిన  న్యాయం చేస్తారని కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ  వెన్నపూస వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు