వరికి నీరిచ్చి తీరుతాం..

17 Sep, 2019 08:16 IST|Sakshi
వరి నారుమడులు, ఇన్‌సెట్‌లో మంత్రి బాలినేని

ధైర్యంగా వరి నాట్లు వేసుకోండి

మాగాణి రైతులకు మంత్రి బాలినేని భరోసా

మెట్ట పంటలకే నీరు అనే పుకార్లు నమ్మొద్దని వినతి

సాక్షి, ఒంగోలు సిటీ: ఈ సీజన్‌లో వరి సాగుకు నీరిచ్చి తీరతామని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా రైతులు ధైర్యంగా వరి నాట్లు వేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ వరి రైతులకు ఈ సీజన్‌లో తగినంత నీరు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, జిల్లాలో మాగాణి పంటలకు నీరు ఇవ్వనున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద నీరు సమృద్ధిగా చేరిందని వివరించారు.

రైతులు వరి పండించుకొనేందుకు వీలుగా ఈ సీజన్‌లో నీటిని విడుదల చేయడానికి సీఎం ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు అదనంగా 12 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ఆమేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వరికి నీరు రాదని, ఈ సీజన్‌లో మెట్ట పంటలకు మాత్రమే నీరు విడుదల చేస్తారని రైతులను పక్కదారి పట్టిస్తున్నారని, ఇలాంటి వదంతులను నమ్మొద్దని బాలినేని కోరారు.

మరిన్ని వార్తలు