రాష్ట్రంలో సంక్షేమం చతికిల పడింది

15 Dec, 2018 13:03 IST|Sakshi
బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రచారార్భాటం తప్ప బాబు ఒరగపెట్టిందేమీ లేదు

కరువు ఉపశమన చర్యలు శూన్యం

రైతుల గోడు పట్టించుకునే వారు లేరు

సాగర్‌ ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి కూడా లేదు

జిల్లాలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌ సీపీ

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చతికిలపడిందని, ప్రచారార్భాటం తప్ప చంద్రబాబు ప్రజల గోడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో వరుస కరువులతో ప్రజలు అల్లాడిపోతున్నా ఉపశమన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సాగర్‌లో నీరున్నా ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ ప్రకాశంలో గుక్కెడు మంచినీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లాల్సిన దుర్భిక్ష పరిస్థితి జిల్లాలో నెలకొందని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు నివారించాల్సిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదన్నారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఇచ్చిన హామీలనే మళ్లీ ఇవ్వడం తప్ప నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. తీరా ఎన్నికలొచ్చాకా దొనకొండ, కనిగిరి నిమ్జ్, రామాయపట్నం పోర్టులు చంద్రబాబుకు గుర్తొచ్చాయన్నారు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ మంజూరైతే ఇప్పటి జిల్లాలో ట్రిపుల్‌ ఐటీని నడపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని బాలినేని విమర్శించారు. తీరా ఎన్నికలొచ్చాక బాబుకు జిల్లాకు ఇచ్చిన హామీలు గుర్తుకొచ్చాయని ఎద్దేవా చేశారు.

ఈ సర్కారుకు రైతులపై ప్రేమలేదు..
సుబాబుల్, జామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలిందని బాలినేని విమర్శించిరు. రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. జిల్లాలో వైఎస్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు జనం మదిలోకి వెళ్లాయన్నారు.    జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు