తాలూకా సీఐపై ఎస్పీకి బాలినేని ఫిర్యాదు

25 Dec, 2018 13:18 IST|Sakshi
ఎస్పీ సత్య ఏసుబాబుతో మాట్లాడుతున్న మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు: తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని, పోలీసు విధుల్లో ఉన్న వారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటంటూ ఎస్పీ సత్యఏసుబాబుతో మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆయన స్వయంగా హాజరయ్యారు. ఇటీవల ఇందిరమ్మ కాలనీలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారని, ఆ ఫ్లెక్సీలో పలువురు మహిళలు కూడా ఉన్నారన్నారు. ఈ క్రమంలో కోటేశ్వరి అనే మహిళ పట్ల సాయి అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె అతడిని ప్రశ్నించిందని ఎస్పీ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు.

దీనికి అతను పరుష పదజాలం వాడడంతో మనస్తాపానికి గురైన ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా మరునాడు రమ్మని సూచించారన్నారు. ఆదివారం ఆమె పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో ఉంచుకొని ఫిర్యాదు చేసిన మహిళను మనస్తాపానికి గురిచేశారని బాలినేని పేర్కొన్నారు. అంతే కాకుండా సోమవారం ఉదయం మళ్లీ పోలీసుస్టేషన్‌కు రావాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు హెచ్చరించాడన్నారు. ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు సరైన చర్యలు కాదని, ఇటీవల కేశవరాజుకుంట వ్యవహారంలో కూడా సీఐ స్థానిక మహిళల పట్ల ఉపయోగించిన పదజాలం బాధాకరమన్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఇందిరమ్మ కాలనీ ఘటనపై పూర్తి సమాచారంతో తనకు సోమవారం సాయంత్రానికి రిపోర్టు అందజేయాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లును ఆదేశించారు. అంతే కాకుండా విధి నిర్వహణలో వివాదం తెచ్చుకోవద్దంటూ హితవు పలికారు. సోమవారం జిల్లా ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌కు మొత్తంగా 45 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిశీలించి న్యాయం చేయాలంటూ సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు.

మరిన్ని వార్తలు