అది వారే నిర్ణయించుకోవాలి: బాలినేని

24 Oct, 2019 13:18 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

అది వారే నిర్ణయించుకోవాలి..
పర్చూరు విషయంలో కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్‌.... దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని.. ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో పర్చూరు విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు