‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు’

19 Nov, 2019 13:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ : 2020 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగరపాలకసంస్ధ సంయుక్త భాగస్వామ్యంతో మంగళవారం ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ వ్యర్థాల నుంచి ఇటుకలు, టైల్స్‌ తయారు చేయడాన్ని మంత్రి బాలినేని పరిశీలించారు. అలాగే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సిమెంట్‌ కంపెనీలకు తరలించే వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..  కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేంధించేలా చర్యలు చేపట్టినట్లు, 110 మున్సిపాలిటీల్లో ఈ విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్‌ నిషేధించాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, 44 మున్సిపాలిటీల్లో మెటీరియల్‌ రికవరీ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో గత కొన్నేళ్లుగా డంపింగ్‌ యార్డు సమస్యగా మారిందని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నగరంలో ప్రతిరోజు 500 టన్నుల చెత్త ఉత్పత్తి అయి ఈ యార్డుకు చేరుతుందని, పనికిరానీ వ్యర్థాలను సిమెంట్‌ కంపెనీలకు పంపడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మార్చడం లో గత ప్రభుత్వం విఫలమైందని, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగర పాలక సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్  సంయుక్త భాగస్వామ్యంతో  ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. గుంటూరు, పాతపాడు  ప్రాంతలకు డంపింగ్‌ యార్డు తరలించేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేశామని వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న కుమార్‌ వెల్లడించారు. 250 టన్నుల పొడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టామని, అల్ట్రాటెక్ సిమెంట్ వారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఫ్యూయల్ గా వినియోగించుకునేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా