ఆటాడుకుందాం.. రా

28 Apr, 2015 02:55 IST|Sakshi
ఆటాడుకుందాం.. రా

బాల్ బ్యాడ్మింటన్
 
వూల్‌తో గుండ్రంగా 23 గ్రాముల బంతితో 12 నుంచి 24 మీటర్ల పొడవైన కోర్టులో ఆడే ఆటే బాల్ బ్యాడ్మింటన్. రాకెట్‌తో ఆడే ఆటలకు భారతదేశం పెట్టింది పేరు.  ఇక్కడే పుట్టిన ఈ ఆట దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. బాల్ బ్యాడ్మింటన్ బంతిపై పట్టుకు చక్కటి నైపుణ్యం ఎంతో అవసరం. సాయం సమయాల్లో ఓ రాకెట్‌తోపాటు మెత్తని బంతితో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎంతో ఉత్సాహంతో ఆడుకుంటారు. ఆటలో ఎటువంటి ప్రమాదం జరగకుండా నిలకడతో ఆడుకునే ఆటగా ప్రసిద్ధం. తొలుత ఈ ఆట ఔట్‌డోర్ క్రీడగానే ఆడినా ఇటీవల కాలంలో ఇండోర్‌లోనూ ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆటగాళ్లకు మంచి పట్టున్న ఆటల్లో ఇది ఒకటి. చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన ఆటగాళ్లకు స్టార్ ఆఫ్ ఇండియాతో సత్కరిస్తారు. తొలి జాతీయ చాంపియన్‌షిప్‌ను 1956లో ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించారు.
  విశాఖపట్నం
 
 ఆట ఇలా...


జట్టులో ఏడుగురు ఆటగాళ్లున్నా ఆటకు దిగేది ఐదుగురే. 12 ఁ 12 మీటర్ల కోర్టులో ఇద్దరు ఫ్రంట్ పొజిషన్‌లో ఆడుతుంటే మరో ఇద్దరు బ్యాక్ పొజిషన్‌లో ఆడతారు. ఒకరు సెంటర్ ఆటగాడు. 29 పాయింట్లు సాధించిన జట్టుదే విజయం. డబుల్స్ ఆటలో జట్టుకు ఇద్దరితోనూ  ఆడుతారు. నిబంధనలు రెండు విధాల ఆటకు ఒకేలా ఉంటాయి. నెట్ భూమికి రెండు మీటర్ల ఎత్తుగా ఉంటుంది.
 
ఆడేది ఇలా...

బంతిని కోర్టు కుడివైపు ఆటగాడు సర్వీస్‌తో ప్రారంభిస్తాడు. బంతి ప్రత్యర్ధి జట్టులోని కుడివైపు కోర్టులో నెట్‌కు తాకకుండా పడాలి. లేకుంటే ఫౌల్. పాయింట్ వస్తే కుడివైపు నుంచి ఎడమవైపుకు వెళ్ళి సర్వీస్ చేస్తాడు. బంతి ఈసారి ఎడమవైపు కోర్టులోకి వెళ్ళాలి. ఇలా పాయింట్లు
 వస్తున్నంత సేపు ఆదే ఆటగాడు ఆటను కొనసాగిస్తాడు. రిసీవ్ చేసుకున్న ఆటగాడు ఒక స్ట్రోక్‌లోనే తిరిగి ప్రత్యర్థి కోర్టులోకి పంపాలి. ఎటువైపు కోర్టులోకి పంపినా పర్వాలేదు. 8, 15, 22పాయింట్ల వద్ద కోర్టు మారాల్సి ఉంటుంది. సర్వీస్ మాత్రం అండర్ హాండ్‌గానే చేయాలి. నడుముకు పైభాగంలోకి వెళ్లకూడదు.

విజయమిలా...

మూడు గేమ్‌లుంటాయి. తొలి గేమ్ తర్వాత రెండు నిమిషాల విరామమిస్తే తర్వాత రెండు గేమ్‌లకు ఐదు నిమిషాలు విరామమంటుంది. రెండు వరుస గేమ్‌ల్ని ఓ జట్టు గెలుచుకుంటే మూడో గేమ్ ఆడకుండానే విజయం సొంతమవుతుంది. ప్రతి మ్యాచ్‌ను ఇద్దరు రిఫరీలతోపాటు ఒక అంపైర్ పర్యవేక్షిస్తుంటారు.

ఆటలో నైపుణ్యాలు...

రాకెట్ పట్టుకునే విధానం గ్రిప్ అయితే సర్వీసుల్లో లో, హై, ఫ్లిక్, స్క్రూ అనే విధంగా ఉంటాయి. రిటర్న్ ఇవ్వడం, బంతిని ఆటలో ఉంచడం, టాప్ స్పిన్ చేయడం, హఠాత్తుగా బంతిని డ్రాప్ చేయడం ఆటలో నైపుణ్యాలే.
 

మరిన్ని వార్తలు