బలమా?.. బలహీనతా?

18 Sep, 2013 02:43 IST|Sakshi

నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: ఇటీవల బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరిన కొద్దిరోజుల్లోనే పార్టీ నేతల తో మనస్పర్ధలు కొని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
 నాగం రాకతో నియోజకవర్గంలో బీజేపీ వె లిగిపోతుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగులుతుందా? ఇటీవలి పరిణామాలు ముఖ్యం గా మంగళవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన తె లంగాణ విలీన దినోత్సవసభ అవుననే చెబుతున్నా యి. రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో నెంబర్.
 
 2 స్థానంలో వెలుగొంది తెలంగాణ అంశంపై పార్టీ అధినేతతో విభేదించి సొంతంగా నగారా సమితిని స్థాపించి అనతి కాలంలోనే దాన్ని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.. నాగం రాకను స్థానిక నేతలు వద్దనలేక రారమ్మని ఆహ్వానించలేక అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు. స్వతంత్రుడిగా ఉన్నా.. పార్టీలో ఉన్నా వ్యక్తిగత ఎజెండా అమలు చేయడం, సొంత క్యాడర్‌ను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తున్నదే. జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఇదికొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది.
 
 విలీనమా? విమోచనా?
 జేఏసీ పేరున నాగం నిర్వహించిన సభ బీజేపీలో అంతర్గత స్పర్ధలకు అద్దంపట్టింది. ముఖ్యంగా బీజేపీ నేతలు నిజాంపాలన నుంచి విమోచన దినంగా చెబుతుండగా.. నాగం మాత్రం విలీన దినోత్సవం అనడం, ‘తెలుగు భాషోన్మాదులు’ ఉర్దూ, దక్షిణ కల్చర్ నాశనం చేశారని అనడం బీజేపీ శ్రేణుల్లో విస్మయం కలిగించింది. వేదికపై మాట్లాడేందుకు ఏ ఒక్క బీజేపీ నేతకు అవకాశం దొరికినా ఆ విషయం బట్టబయలయ్యేదని పలువురు అంటున్నారు.
 
 సభ సొంత ఇమేజ్ కోసమేనా?
 బీజేపీలో చేరిన నాగం నాగర్‌కర్నూల్‌లో జరిగిన విలీన దినోత్సవం సభ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెబుతుండగా, ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికేనని పలువురు భావిస్తున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి నగారా సమితిని స్థాపించినా దాన్ని ఎక్కువకాలం నడపడం ఇబ్బందిగా మారడం, పెద్దగా గుర్తింపు కూడా లభించకపోవడంతో జాతీయ పార్టీ బీజేపీలో చేరిన నాగం తనస్థాయికి తగిన హోదా, అనుభవానికి తగిన బాధ్యతలు అప్పగించడం లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు మరికొన్ని విషయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితో కూడా కొంత గ్యాప్ వచ్చినట్లు సమాచారం. జాతీయ పార్టీలో చేరి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించి.. తెలంగాణ విషయంలో వేగంగా మారిన రాజకీయాలు, కాంగ్రెస్‌లో జైపాల్‌రెడ్డి రానున్నాడనే వార్తలు నాగం పోటీని మరింత సందిగ్ధంలోకి నెట్టేశాయి.
 
 దీంతో తిరిగి నాగర్‌కర్నూల్‌పైనే నాగం దృష్టి సారించినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్‌లో సొంత ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి నాగం యత్నిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీలో చేరడంతో ఇప్పటివరకు నాగంకు అండగా ఉన్న ముస్లిం ఓట్లలో కూడా చీలిక వచ్చినట్లు, ఆ గ్యాప్ భర్తీ చేసుకునేందుకే భాషోన్మాదులు అనడం, ఉర్దూ భాషను అణిచివేశారని చెప్పడం వెనక రహస్యం దాగి ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
 
 పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం
 ప్రతి సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో విమోచన దినోత్స వం నిర్వహించేవారు. ఆర్డీఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పతాకాలు ఎగురవేసేవారు. కాగా, నాగం రాకతో ఈ ఏడాది పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశించిన బీజేపీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. బహిరంగ సభలో ఎ క్కడా బీజేపీ ప్రస్తావన లేకపోవడం, ఫ్లెక్సీలలో వేదికలపైనా పార్టీ వారికి ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా సభాస్థలి నుంచి వెనుదిరి గారు. పీఆర్ అతిథిగృహంలో మోడీ జన్మదినం సందర్భంగా కూడా కేక్ కట్‌చేసి ఒక్కడే మాట్లాడి ముగించారు. మరో బీజేపీ నేత ఎవరికీ అవకాశం ఇవ్వకపోవ డం పట్ల కూడా ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, ఆవేదన కలిగించినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు