బీమా పేరిట నిండా ముంచారు....

21 Nov, 2018 08:02 IST|Sakshi
జగన్‌తో మాట్లాడుతున్న రైతులు

జగన్‌ వద్ద అరటి రైతుల ఆవేదన

ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌కు ప్రజలు దారి పొడవునా తమ సమస్యలను చెబుతూనే ఉన్నారు. నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని విధాల నష్టపోయామని పేర్కొంటున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారు తమ బాధలను జగన్‌ వద్ద చెబుతూ కన్నీరు పెడుతున్నారు. మీరు సీఎం అయ్యాక మా కష్టాలు తీర్చాలంటూ వేడుకొంటున్నారు.

ప్రజాసంకల్పయాత్ర బృందం:  బీమా కంపెనీతో అధికారుల చేతులు కలిపి సమావేశాలు నిర్వహించి మరీ ప్రీమియం వసూలు చేశారు. ఇటీవల తిత్లీ తుపానుకు అరటి పంట దెబ్బతింటే బీమా సమయం మించిపోయిందని మమ్మల్ని నిండా ముంచారంటూ కురుపాం నియోజకవర్గంలోని 61 మంది రైతులు జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు.  ప్రజాసంకల్పయాత్ర 302 రోజు మంగళవారం జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామానికి చెందిన  రైతులు గుంట్రెడ్డి అప్పలనాయుడు, రామకృష్ణ నాయుడు, పెదవెంకట నాయుడు, శంబంగి పరమేశ్‌ నాయుడు తదితరులు కలసి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేత  జగన్‌ ఎదుట వివరించారు.  జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన 61 మంది రైతులు ఎకరాకు రూ.వేల చొప్పున హార్టీకల్చర్‌ అధికారుల ద్వారా ప్రీమియంను అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించామన్నారు. 

మొత్తంగా రూ. 4లక్షలకు పైగానే ప్రీమియం వసూలు చేశారని సంవత్సరం పాటు అరటి పంటకు బీమా కింద చెల్లించాలని రైతులకు అధికారులు సమావేశాలు నిర్వహించి మరీ కట్టించారని రైతులు చెప్పారు.  వాతావరణ ఆధారిత పంటల బీమా 17–18 కింద ప్రీమియం చెల్లించాక మాకు అధికారులు కూడా రశీదులు ఇచ్చారని, ఇటీవల తిత్లీ తుపానులో అరటి మొత్తం ధ్వంసం అయినా పరిహరం ఇవ్వలేదని వాపోయారు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు పరిహారం గూర్చి అడిగితే మొహం చాటేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్‌ అధికారులను అడిగితే శాటిలైట్‌ ద్వారా సర్వే చేస్తామని ఒకసారి, మా పైవాళ్లను అడగండని మరో సారి సంబంధం లేని మాటలాడుతున్నారని వాపోయారు. కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు అన్నదాత కోర్టులకు కూడా వెళ్లాల్సి వస్తుందని జగన్‌ వద్ద వాపోయారు.

మరిన్ని వార్తలు