బందరు బీచ్ కళావిహీనం

7 Nov, 2013 02:01 IST|Sakshi

 

=పర్యాటకులకు కరువైన వసతులు
 = పై-లీన్ తుపానుకు కొట్టుకుపోయిన బారికేడ్లు
 = కార్తీక మాసంలోనూ స్పందించని అధికారులు

 
 పర్యాటకులను ఆకర్షించే మంగినపూడిబీచ్ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పర్యాటకశాఖ పట్టించుకోకపోవడంతో బీచ్ కళావిహీనంగా మారింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పుణ్యస్నానాలకు వచ్చేందుకు పర్యాటకులు వెనుకాడుతున్నారు.
 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : కార్తీక మాసం ప్రారంభం కావడంతో వనభోజనాలు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు పర్యాటకులు, భక్తుల రాక ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వేల సంఖ్యలో బీచ్‌కు తరలివస్తారు. పౌర్ణమి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తుం టారు. పర్యాటకశాఖ ద్వారా రూ.95 లక్షలతో బీచ్‌ను అభివృద్ధి చేస్తామని ఎప్పటి నుంచో అధికారులు చెప్పడమే తప్ప అమలుకు నోచడంలేదు. రూ.4 లక్షలతో చేపట్టిన దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇటీవల సంభవించిన పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు, ఇసుక మేటలతో బీచ్ దర్శనమిస్తోంది. తాళ్లపాలెం పంచాయతీకి నిర్వహణ బాధ్యతలను వదిలేసిన పర్యాటకశాఖ మంగినపూడిబీచ్ తమ పరిధిలోది కాదనే విధంగా వ్యవహరిస్తోందని పర్యాటకులు విమర్శిస్తున్నారు.
 
కళకోల్పోయిన బీచ్

 ఐదారు సంవత్సరాలుగా పర్యాటకశాఖ పట్టిం చుకోకపోవటంతో బీచ్ కళ కోల్పోయింది. 2007లో నవీన్‌మిట్టల్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో బీచ్‌కు వెళ్లే దారిలో చేపల బొమ్మలు, ప్రాంగణంలో జల కన్యలు, ఒంటెల బొమ్మలను, మత్స్యకారులు సముద్రంలో వేటడాన్ని తెలిపే బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దూరప్రాంతం నుంచి బీచ్‌కు వచ్చిన పర్యాటకులు కూర్చునేందుకు కనీసం సిమెంటు బల్లలు కూలిపోయాయి. పై-లీన్ తుపాను తాకిడికి కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో బీచ్ ప్రాంగణం మొత్తం గోతులమయంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బీచ్‌ను ప్రైవేటీకరణ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదపడం వివాదాస్పదమవుతోంది.
 
కొట్టుకుపోయిన బారికేడ్లు

 పర్యాటకులు సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్నారన్న సాకుతో గత ఏడాది నాలుగు నెలల పాటు బీచ్‌ను మూసివేశారు. కార్తీక పౌర్ణమికి రెండు రోజులు ముందు బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించారు. సముద్రం లోతులోకి వెళ్లకుండా అరకిలోమీటరు వ్యాసార్థంలో సముద్రంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారి కేడ్లకు తాళ్లు కట్టి రక్షణ చర్యలు చేపట్టారు.అయితే అక్టోబర్‌లో సంభవించిన పై-లీన్ తుపాను కారణంగా కెరటాలు ఎగసిపడటంతో బారికేడ్లు కొట్టుకుపోయాయి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు