బడ్జెట్‌లో మనకు దక్కేదెంత!?

10 Mar, 2016 00:47 IST|Sakshi

నిధుల కోసం ఎదురుచూస్తున్న   ప్రాజెక్టులు
గన్నవరం, బందరు పోర్టులకు  నిధుల కొరత
కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులపై  దృష్టి పెడతారా?
పర్యాటక రంగానికి సపోర్టు ఎంత..
గత బడ్జెట్‌లో పెట్టిన అంశాలు    కార్యరూపం దాల్చని వైనం

 
విజయవాడ: కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేడు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారనే అంశంపై జిల్లాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. గత ఏడాది బడ్జెట్‌లో మన జిల్లాకు ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా అవకాశాలు దక్కుతాయని ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాజధాని ప్రాంతానికి న్యాయం జరగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లోని ప్రాజెక్టులు వాటికి కావాల్సిన నిధులను పరిశీలిస్తే..

గన్నవరం విమానాశ్రయ విస్తరణకు..
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచాలంటే 698 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిలో 438 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 180 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన వారు ముందుకు రాలేదు. రెండో విడత 260 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేయాలంటే సుమారు రూ.360 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నారు.
 
మచిలీపట్నం పోర్టు విస్తరణకు..
మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి గాను 5,324 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఎప్పటికప్పుడు భూముల్ని సేకరిస్తామని హడావుడి చేయడమే తప్ప తగినంత నిధులు కేటాయించలేదు. ఆ నిధులకు కొత్త బడ్జెట్‌లో స్థానం దక్కుతుందేమో చూడాలి. మచిలీపట్నం పోర్టుతో పాటు క్రోకరీ, రిఫైరనరీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీటికి కావాల్సిన నిధులు కేటాయించాల్సి ఉంది.
 
భవానీ ద్వీపం విస్తరణకు..
ఎన్నికలకు ముందు భవానీ ద్వీప విస్తరణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన సీఎం ఆ తరువాత మాటమార్చారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భవానీద్వీపంలో వాటర్‌గేమ్స్‌ను చాంపియన్ యాచ్ క్లబ్‌కు అప్పగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి  రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గత బడ్జెట్‌లోనే భవానీద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కావాల్సిన నిధులు గత ఏడాది కాలంలో ఖర్చు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

పర్యాటక రంగానికి నిధులిస్తారా..
రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారే తప్ప వాస్తవంగా నిధులు కేటాయించడం లేదు. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన దేవాలయాలను కలుపుతూ టెంపుల్ సర్కిల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చు. కొండపల్లి, ఉండవల్లి కొండల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
 
గత బడ్జెట్‌లో హామీలు ఇచ్చి..
గత ఏడాది మార్చి 12న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో బందరులో మెరైన్ అకాడమి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హస్తకళల అభివృద్ధి కోసం జిల్లాలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం చేశారు.విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చాలని గత బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. కేంద్ర  పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో విజయవాడ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసింది.  కృష్ణాడెల్టా ఆధునికీకరణకు గత బడ్జెట్‌లో రూ.111 కోట్లు కేటాయించినా అరకొరగానే పనులు జరిగాయి. ఆ పనుల తాలుకా బిల్లులు ఇవ్వకపోవడంలో కొత్తగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక పులిచింతల, పట్టిసీమ పనులు సాగుతూనే ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఆయుర్వేద యూనివర్శిటీ ఏర్పాటుచేస్తామన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు.  కృష్ణాజిల్లాలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఊసే నేతలు ఎత్తడం లేదు.
 
 

మరిన్ని వార్తలు