త్వరలోనే బందరు పోర్టు పనులు ప్రారంభం

11 Aug, 2019 10:24 IST|Sakshi

నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

ఎంపీ బాలశౌరి వెల్లడి

సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం): బందరు పోర్టు పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని, నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే గిట్టని వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోర్టు నిర్మాణం నిలిచిపోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నాలుగైదు బెర్త్‌లు నిర్మించేందుకు ఎక్కువ నిధులు కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ సంస్థ పోర్టు నిర్మాణంలో కలిపి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ఆర్థిక అభ్యంతరాలను తొలగించనున్నామని తెలిపారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

డ్యామ్‌లు నిండుతున్నాయి: ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే దేవుని చలువతో డ్యామ్‌లు అన్ని నీటితో కళకళలాడుతున్నాయని ఎంపీ బాలశౌరి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండిని తర్వాత పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో పంటకు కూడా నీటి సమస్య రాకుండా రైతులు సంతోషంగా ఉండేలా చేస్తామని చెప్పారు. పంటలకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు.

ఆరు లైన్ల రహదారులకు నూతన ప్రతిపాదనలు..
కృష్ణా జిల్లాలో ట్రాఫిక్‌ నియంత్రణ, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం ఆరు లైన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రతిపాదనలు అందించినట్లు ఎంపీ తెలిపారు. గుండుగొలను నుంచి కలపర్రు వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 505.40 కోట్లు, కలపర్రు నుంచి చినఅవుటుపల్లి వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 512.43 కోట్లు, చినఅవుటుపల్లి – గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లకు రూ. 752.15 కోట్లు, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు మధ్యలో కృష్ణా నది ఐకానిక్‌ బ్రిడ్జితో సహా 17.8 కిలోమీటర్లకు రూ. 1,215.19 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు బూరగడ్డ రమేష్‌నాయుడు, ఉప్పాల రాంప్రసాద్, రాజులపాటి అచ్యుతరావు, తిరుమాని శ్రీనివాసరావు, బండారు చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు