పొట్ట కొట్టొద్దంటే.. తిట్ల భోజనం పెట్టారు!

10 Jul, 2018 11:59 IST|Sakshi
ఎమ్మెల్యే బండారు తీరుతో మనస్తాపానికి గురై రోదిస్తున్న రాజమ్మ

ఆడపడుచులను ఆడిపోసుకున్న ఎమ్మెల్యే బండారు

మధ్యాహ్న భోజన నిర్వాహకులపై పరుష పదజాలం

మనస్తాపంతో రోదించిన మహిళలు

ఆనక విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు.. తన పరిధిలోని ప్రజలతో మేమకమవ్వాలి.. వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి.. సమస్యలపై ఆరా తీయాలి.. వాటి పరిష్కారానికి తన శక్తి మేరకు కృషి చేయాలి..
కానీ ఆ ప్రజాప్రతినిధి దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు..  కష్టాలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కసురుకున్నారు.. పరుష పదజాలంతో రెచ్చిపోయారు.. నోర్మూసుకొని వెళ్లండి.. అని గద్దించారు..
ఆయన ఉగ్ర తాండవం చూసి.. పాపం ఆ మహిళలు హతాశులయ్యారు.. అందరిలో అలా తిట్టడంతో మనస్తాపానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు..

ఆడకూతుళ్లను అంత క్షోభకు గురి చేసిన ఆ ప్రజాప్రతినిధి ఎవరంటారా?.. ఇంకెవరు.. పెందుర్తి తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తే..మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ ఏజెన్సీలకు కట్టబెట్టిన నేపథ్యంలో.. ఏళ్ల తరబడి పథకాన్ని నిర్వహిస్తున్న తమ పొట్టకొట్టవద్దని వేడుకునేందుకు సోమవారం పెందుర్తి సామాజిక ఆస్పత్రి వద్ద ఉన్న ఎమ్మెల్యే బండారు వద్దకు వెళ్లిన ఎండీఎం నిర్వాహకులపై ఆయన చిందులు తొక్కారు..కనీసం వారు చెప్పేది పూర్తిగా వినకుండానే.. తోక తొక్కిన తాచులా లేచిన ఎమ్మెల్యే తీరుతో మనస్తాపానికి గురైన మహిళలు..కాసేపటికి తేరుకొని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

పెందుర్తి: ‘అయ్యా.. అనేక సంవత్సరాల నుంచి వచ్చీరాని బిల్లులు... కడుపు నింపని వేతనం... ఇప్పుడేమో ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్‌లు ఇచ్చేస్తే మేం ఎలా బతుకుతాము సార్‌... పెద్దోళ్లు మీరే మా కష్టాలు గట్టెక్కించాలి’ అంటూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎదుట పెందుర్తి, చినగదిలి మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆవేదనతో చేసుకున్న వినతి. ఒక్క నిమిషం విని ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బండారు... ‘ఏయ్‌.. ఎవరు మీరంతా.. నాకే అడ్డంగా వచ్చి మాట్లాడుతారా.. నోర్మూసుకుని ఇక్కడి నుంచి పోండి.. పిచ్చిపిచ్చిగా ఉందా ఒక్కొక్కళ్లకి’... అంటూ నోరు పారేసుకున్నారు. ఏ మూలకూ రాని వేతనాలు.. ఎప్పుడు మంజూరవుతాయో తెలియని బిల్లులతో పోరాటం చేస్తూ తమ కడుపులు మాడ్చుకుని బడి పిల్లల కడుపు నింపుతున్న బడుగులపై చిందులు తొక్కారు.

అసలేం జరిగిందంటే...
తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం ఉదయం ధర్నా చేసేందుకు పెందుర్తి, చినగదిలి మండలాలకు చెందిన పాఠశాలల మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు పెందుర్తి విద్యాశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో పెందుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు ఎమ్మెల్యే బండారు వచ్చారన్న సమాచారంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎండీఎం నిర్వాహకులంతా అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే ఆస్పత్రి నుంచి బయటకు రావడంతో వీరంతా ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక్క నిమిషం పాటు సమస్యలు విన్న బండారు క్షణాల్లో తీవ్ర ఆగ్రహానికి లోనై వారిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఏం.. ఏం  మాట్లాడుతున్నారు.. పిచ్చిపిచ్చిగా ఉందా.. నోర్మూసుకొని ఇక్కడి నుంచి పోండి’ అంటూ తీవ్రస్వరంతో దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా మహిళలు అని చూడకుండా చుట్టూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రోగులు ఉన్నారన్న ఇంగితం కూడా మర్చిపోయి తీవ్రంగా గద్దించారు. ఏన్నో ఏళ్లుగా తాము పడుతున్న కష్టాలను తీర్చమనడమే ఆ మహిళలు చేసుకున్న నేరంగా తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే తీరుతో హతాసులైన ఎండీఎం నిర్వాహకులు అక్కడి నుంచి ఆవేదనగా వెనుదిరిగారు. ఎమ్మెల్యే దూషణలకు గురైన బాధిత మహిళలు భోరున విలపించారు. వారిని చూసి మిగిలిన వారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. తేరుకున్నాక స్థానిక విద్యాశాఖ భవనాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరును కడిగేశారు. తమ కష్టాలు తీరుస్తాడని ఓట్లేస్తే ఇలా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మనసు కకావికలమైపోయింది
ఎమ్మెల్యే పెద్ద మనిషి అని మా బాధలు చెప్పుకుందామని వెళ్లాం. మా కష్టాలు చెప్పుకుంటుంటుండాగానే మాపై విరుచుకుపడ్డారు. నన్ను వేలు చూపించి నోర్ముయ్‌.. ఇక్కడి నుంచి పో అని ఆగ్రహంతో ఊగిపోవడంతో గుండె ఆగినంత పనయింది. కొంతసేపు మనిషిని కాలేకపోయాను. ఓట్లు కోసం మా ఇంటికి వచ్చి అభ్యర్థిస్తే మంచి మనిషి అని ఓటు వేశాను. ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది. మనసు బాధతో రగిలిపోతుంది.(విలపిస్తూ).– టి.రాజు(రాజమ్మ), జంగాలపాలెం, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు

బండారు క్షమాపణ చెప్పాలి
నిరుపేదలు, మహిళలు అని చూడకుండా ఎమ్మెల్యే బండారు ఎండీఎం నిర్వాహకులను దూషించడం హేయమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జి.అప్పలరాజు మండిపడ్డారు. కార్మికులకు జరిగిన అవమానం తెలుసుకున్న సీఐటీయూ నేతలు వారిని పరామర్శించి... వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై వివక్ష చూపుతూ ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుండగా.. అదే ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మెల్యే బండారు కార్మికులపై చిందులు తొక్కడం టీడీపీ ప్రభుత్వ ఆగడాలకు పరాకాష్ట అన్నారు. ఎమ్మెల్యేకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వినాలి... లేదంటే వెళ్లిపోమని చెప్పాలి గానీ.. ఇలా ఇష్టారీతిన దూషించడం సరికాదన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ఎమ్మెల్యే వ్యవహారశైలి మార్చుకోవాలని హితవు పలికారు. తక్షణమే బండారు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు