-

‘క్యాష్’ కాజేసింది క్యాషియరే

24 Nov, 2013 03:43 IST|Sakshi

 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నగరంలోనిరామనగర్‌లోని అనంతపురం కోఆపరేటీవ్ టౌన్ బ్యాంకులో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో ఆ బ్యాంకు క్యాషియరే ప్రధాన నిందితుడు. ఈ కేసులో స్థానిక మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న, క్యాషియర్‌గా పని చేసే కొప్పల రామేశ్వరరెడ్డి అలియాస్ బాబు, గోరంట్ల మండలం, వానవోలు గ్రామానికి చెందిన షేక్‌బాబా ఫకృద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం స్థానిక టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో సీసీఎస్ సీఐ ఏ.శ్రీనివాసులు, టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, సీఐ రాజా, ఎస్‌ఐ రెడ్డెప్ప  విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
 
  బీ.కాం వరకు చదివిన కనగానపల్లి మండలం తూముచర్లకు చెందిన కొప్పల రామేశ్వరరెడ్డి (ప్రస్తుతం మారుతీనగర్ వాసి) డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ అఫ్లికేషన్ కోర్సు చేశాడు. రుద్రంపేట సమీపంలో కొందరు భాగస్వాములతో కలసి ఆర్మీ స్కూల్ నడిపాడు. ఆరేళ్ల క్రితం టౌన్ బ్యాంకులో క్లర్క్‌గా చేరి క్యాషియర్ ఎదిగాడు. రెండేళ్లుగా బ్యాంకును కొల్లగొట్టాలన్న దుర్బుద్ధి కలిగింది. ఈ క్రమంలో చోరీకి పథకం పన్ని వారం ముందుగానే షేక్ ఫకృద్దీన్ కు బ్యాంకు తాళాలు ఇచ్చి డూప్లికేట్ తాళాలు తయారు చేయించాడు.
 
 ఈ నేపథ్యలో బ్యాంకు లావాదేవీల్లో కూడా రూ.15 వేలు కాజేసి, దానిని రికార్డుల్లో కచ్చితంగా చూపాడు. అంతేకాకుండా మేనేజర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి, స్ట్రాంగ్ రూములో క్యాష్‌ను భద్రపరిచే బాధ్యతను క్యాషియర్‌పై వదిలేశాడు. దీంతో అదను చూసి చోరీ చేసేందుకు నాలుగు రోజులుగా రామేశ్వరరెడ్డి స్ట్రాంగ్ రూముకు తాళాలు వేయకుండా వచ్చాడు. 19వ తేదీ రాత్రి వ్యక్తిగత పని నిమిత్తం రుద్రంపేట వైపు వెళుతుండగా గుర్తు తెలియని ఆటో అతన్ని ఢీకొంది. దీంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రెవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత ఆపరేషన్‌కు సిద్ధం కావాలని అక్కడి వైద్యుడు చెప్పాడు. దీంతో ప్రాథమిక చికిత్స చేయించుకుని హుటాహుటిన ఇంటికి చేరిన అతను ఇంట్లో దాచిన బ్యాంకు మారుతాళాలను తీసుకుని చోరీకి తెగబడ్డాడు. అప్పటికే తలుపులకు తాళాలు వేయక పోవడంతో నేరుగా వెళ్లి రూ.13.70 లక్షలు నగదును కాజేశాడు. పోలీసులు, డాగ్ స్క్వాడ్ పసిగట్టకుండా నేర స్థలంలో యాసిడ్ చల్లాడు. రాత్రికి రాత్రి బాబా ఫకృద్దీన్‌ను ఇంటికి పిలిపించి డమ్మీ తాళాలను అతనికిచ్చి భద్రపరచమని చెప్పాడు. ఉదయాన్నే చోరీ ఘటన సంచలనం రేపింది. అప్పటికే ఎమీ ఎరగని వాడిలా అతను ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నాడు.
 
  అతని ప్రవర్తనపై అనుమానంతో పాటు కొన్ని ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో నిజాన్ని కక్కాడు. కాగా తనకన్నా రెండేళ్ల జూనియర్ అయిన విశ్వనాథ్‌కు మేనేజర్ పోస్టు రావడంతో క్యాషియర్‌కు అక్కసు పెరిగింది. దీనికి తోడు ఆ శాఖ పాలక వర్గం, క్యాషియర్‌కు చిన్నచిన్న విబేధాలున్నట్లు తెలిసింది. దీంతో మేనేజర్‌ను ఇబ్బంది పెట్టాలని భావించి చోరీకి తెగబడ్డం మరో కారణమని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు