చిక్కిన టక్కరులు

18 Jul, 2014 00:22 IST|Sakshi
అరెస్టయిన అప్పటి బ్యాంకు మేనేజరు భాస్కరాచారి

* అడ్డతీగల ఐఓబీ రుణకుంభకోణంలో 15 మంది అరెస్టు
* రూ.2.5 కోట్ల గోల్‌మాల్‌లో అప్పటి బ్రాంచి మేనేజరూ పాత్రధారే
* నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో బ్యాంకుకు టోపీ
* అమాయక రైతులనూ వంచించిన టక్కరులు
* బయట పడాల్సి ఉన్న మరెందరో మోసగాళ్లు
 అడ్డతీగల : రుణాల పేరుతో బ్యాంకుకు టోపీ పెట్టిన టక్కరుల్లో కొందరు ఎట్టకేలకు కటకటాల వెనక్కి వెళ్లారు. 2010-12 మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) అడ్డతీగల శాఖ నుంచి రూ.2.5 కోట్లను దర్జాగా దండుకున్న వ్యవహారంలో ఆ బ్రాంచి అప్పటి మేనేజర్ కడర్ల భాస్కరాచారిని, మరో 14 మందిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారంతా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు కొందరు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకుని, వారి సంతకాలను ఫోర్జరీ చేసి, తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్టు దర్యాప్తులో తేలింది.

ఐఓబీ అడ్డతీగల శాఖలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు తమ విజిలెన్స్ విభాగంతో దర్యాప్తు జరిపించి, రుణాల మంజూరులో అక్రమాలు వాస్తవమేనని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రుణకుంభకోణంలో మరిన్ని కోణాలు వెలుగు చూశాయి.  ఎటువంటి భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి, వాటిని బ్యాంకులో లక్షల్లో రుణాలు పొందినట్టు తేలింది. అంతేకాక.. అమాయకులైన పలువురు రైతుల నుంచి పాస్ పుస్తకాలు తీసుకుని, బ్యాంక్ నుంచి వారి పేరిట ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుని, వారికి కొద్దిమొత్తమే ఇచ్చి, మిగిలినది మింగిన వైనమూ వెలుగు చూసింది.
 
మరెందరో మోసగాళ్లు..
2010-2012 మధ్య కాలంలో జరిగిన ఈ కుంభకోణంలో రూ.2.5 కోట్ల మేరకు అక్రమార్కులు స్వాహా చేసినట్టు రంపచోడవరం ఏఎస్పీ సీహెచ్ విజయారావు విలేకరులకు తెలిపారు. ఐఓబీ విజిలెన్స్ దర్యాప్తులో 19 మంది అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని, బ్యాంక్ అధికారుల నుంచి తమకు వచ్చిన ఫిర్యాదుపై గత ఏప్రిల్ 24న కేసు నమోదు చేశామని చెప్పారు. అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ వ్యవహారంలో అనేకమంది పాత్ర ఉన్నట్టు తేలిందన్నారు.

గురువారం అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు గంగవరం మండలం సూరంపాలెంకు చెందిన తోటా వరలక్ష్మి, పాలోజి సీత, చవలం ప్రసాద్‌దొర, కుంజం గంగాదేవి, పాలోజి సత్తిబాబు, కొత్తాడకి చెందిన కారం వెంకన్నదొర, పడాల లక్ష్మి, తలారి బేబి(మొల్లేరు), గంగవరానికి చెందిన సారపు కృష్ణదొర, బరిజి కాటంస్వామి, మాగంటి నూతన్‌ప్రసాద్, కోటం ప్రసాద్‌బాబుదొర , అడ్డతీగలకు చెందిన వాకపల్లి గిరిబాబు, కింగు మహంతి శ్రీను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ 15 మందీ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రూ.13.70 లక్షల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు.

తమ దర్యాప్తులో రుణాల కుంభకోణం రూ.2.5 కోట్ల మేరకు జరిగినట్టు తేలిందని, అడ్డతీగల, గంగవరం, వై.రామవరం మండలాల్లో మరెందరో రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని, రుణాల పొందారని చెప్పారు. అమాయకుల ఫొటోలతో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి కూడా రుణాలు తీసుకున్నట్టు బయటపడిందన్నారు. వివిధ ప్రభుత్వశాఖల నుంచి తగిన సమాచారం వచ్చాక మరింతమందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన సీఐ ముక్తేశ్వర్రావు, ఎస్సైలు టి.రామకృష్ణ(అడ్డతీగల), లక్ష్మణరావు(వై.రామవరం), తిరుపతిరావు (దుశ్చర్తి), భీమశంకర్, కానిస్టేబుళ్లను  అభినందించారు.
 

మరిన్ని వార్తలు