బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతో నష్టం

25 Dec, 2014 01:04 IST|Sakshi
బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతో నష్టం

గంట్యాడ: మండలంలోని లక్కిడాం ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ శంకర సూర్యారావు నిర్య్లక్షం కారణంగా నష్టపోయామంటూ బ్యాంక్ పరిధిలో గల సుమారు 10గ్రామాల రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. తొలివిడత రైతు రుణమాఫీ ఎస్‌బీఐ బ్రాంచ్‌పరిధిలో 497మందికి వర్తించింది. ఇందులో 300మందికి పైగా రైతులకు రూ.10లోపు రుణమాఫీ రావడం బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమేనని రైతులు ఆందోళనవ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం వల్లనే రుణమాఫీ వర్తించలేదని వాపోయారు. బ్యాంకులో లోను పెట్టుకున్నప్పుడు పాస్‌పుస్తకాలతోపాటు మీసేవ కార్యాలయంలో తీసిన అడంగల్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు జతచేశామని తెలిపారు.ప్రస్తుతం వచ్చిన రుణమాఫీలో పాస్‌పుస్తకంలో చూపిన విస్తీర్ణం ఇప్పుడు లేదని 0నుంచి 5సెంట్లవరకు మాత్రమే విస్తీర్ణం ఉన్నట్లు చూపారన్నారు.
 
 సెంట్ల భూమి ఉంటే వేలకొద్దీరుణం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు,సిరిపురం ఎంపీటీసీ సభ్యుడు పి.జైహింద్‌కుమార్ మాట్లాడుతూ రైతులపట్ల బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. లోనుకోసం బ్యాంకు చుట్టూ తిప్పి రుణమాఫీ వచ్చేసరికి నిలువునా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేనేజర్‌ను వివరణ అడిగినా సరైన సమాధానం చెప్పడంలేదన్నారు.ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు, అధికార పార్టీ నాయకులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిరిపురం,చంద్రంపేట,రావివలస,లక్కిడాం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు