బ్యాంకు నోటీసుల కలకలం

13 Jun, 2014 00:40 IST|Sakshi
బ్యాంకు నోటీసుల కలకలం

కాకుమాను/రెంటచింతల/చుండూరు: జిల్లాలోని రైతాంగానికి బ్యాంకులు పంపిస్తున్న నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. రైతు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందునుంచీ విస్తృత ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసలు బ్యాంకులకు బకాయిలు చెల్లించొద్దంటూ సలహా కూడా ఇచ్చేశారు. దీంతో ఆయనకు అధికారం కట్టబెట్టిన అన్నదాతలకు బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకులు పంపిస్తున్న నోటీసులు వెక్కిరిస్తున్నాయి.
 
 అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నోటీసులు అందుకున్న రైతులు లబోదిబో మంటున్నారు. సకాలంలో బకాయిలుచెల్లించకుంటే కుదువపెట్టిన ఆస్తులు వేలం వేస్తామంటూ వారు హెచ్చరిస్తుండటంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది.
 
 కాకుమానులో బ్యాంకు ముట్టడి
 కాకుమాను మండలానికి చెందిన పలువురు రైతులు ఆగ్రహంతో గురువారం ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ముట్టడించారు. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన రాకముందే బ్యాంకులు ఇలా నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని నిలదీశారు. కాకుమాను ఎస్‌బీఐ బ్రాంచ్ పరిధిలో గత కొన్నేళ్లనుంచి పంట రుణాలుగా 4200 మంది రైతులు రూ. 42కోట్లు తీసుకున్నారు.
 
 మూడు సంవత్సరాల నుంచి అధిక వర్షాలు, వరదల కారణంగా పంటపోయి రైతులంతా అప్పుల్లో కూరుకొని పోయారనీ, చంద్రబాబు సీఎం అయితే తమ నష్టాలు తీరుతాయనుకుంటే ఇలా నోటీసులు పంపించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చుండూరు ఆంధ్రాబ్యాంక్ నుంచి సుమారు 600 మంది రైతులు ఆరుకోట్ల రూపాయల మేరకు పంట రుణాలు పొందారు. బంగారు ఆభరణాలు కుదువపెట్టి పంట రుణాలు పొందినవారు రుణాలు చెల్లించకపోతే బంగారు నగలు వేలం వేస్తామని నోటీసులు రావడంతో కౌలు రైతుల్లో కలవరం మొదలైంది.
 
 నమ్మించి నయవంచన
 తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని టీడీపీ అధినేత చెబితే నమ్మి గద్దెనెక్కించామనీ, తీరా ఇప్పుడు కమిటీలంటూ కాలయాపన చేయడంపై వారంతా మండిపడుతున్నారు. రెంట చింతల ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని రెంటచింతల, రెంటాల, గోలి, మిట్టగుడిపాడు తదితర గ్రామాలకు చెందిన సుమారు 15వందల మంది రైతులకు బ్యాంక్ అధికార్లు నోటీసులు జారీచేయడంతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ బ్యాంక్ పరిధిలో బంగారం కుదువ పెట్టి పెట్టుబడులకోసం 1000మందికి పైగా రైతులు రూ. 7కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకుంటే బంగారాన్ని వేలం వేస్తామని నోటీసుల్లో హెచ్చరికలు ఒకవైపు... రుణమాఫీ విధివిధానాలకోసం మరో 45రోజులు ఆగాలంటున్న సీఎం చంద్రబాబు ప్రకటన మరోవైపు.. రైతులను ఎటూ తేల్చుకోనీయడం లేదు.
 
 ఎలా చెల్లించాలో తెలీడం లేదు
 సాగు పెట్టుబడికోసం 2012 జూలైలో బంగారం పెట్టి రూ.37 వేల రుణం తీసుకున్నా. అధికార్లు 20వ తేదీలోగా దానిని తీర్చాలని నోటీసు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణం చెల్లిం చలేను. చంద్రబాబు రుణమాఫీ చేస్తారనుకుంటే కాలయాపన చేస్తున్నారు. ఏంచేయాలో తెలీడంలేదు. - జఠావత్ జోజినాయక్, రెంటచింతల
 
 ఉన్నతాధికారుల ఆదేశాలే అమలు చేస్తున్నాం
 బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నాం. రైతులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తాల వివరాలను తెలియచేయాలని నోటీసులు ఇచ్చాం . 2011 సంవత్సరంలో రీ షెడ్యూల్ చేసిన తరువాత ఒకసారి కూడా వాయిదా నగధును చెల్లించని వారికే నోటీసులు జారీ చేశాం. బ్యాంక్‌లో అన్ని రకాల రుణాలు  తీసుకుని  30నెలలు పూర్తి అయిన అందరికీ ఈ నోటీసులు పంపించాం.
 - ఎ.వి.ఎస్.చంద్రమోహన్,
 ఆంధ్రాబ్యాంక్ మేనేజర్, రెంటచింతల
 

>
మరిన్ని వార్తలు