అప్పుతిప్పలు

5 Jan, 2014 01:50 IST|Sakshi
అప్పుతిప్పలు

బడుగులపై బ్యాంకుల శీతకన్ను.. రుణాల జారీలో తీవ్ర అలక్ష్యం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొండిచేయి
పంట రుణాలూ లక్ష్యానికి ఆమడదూరమే
రైతులకిచ్చిన రుణాలు కేవలం 57 శాతమే
కౌలు రైతులకు 15 శాతమైనా ఇవ్వని దైన్యం
పాడికి, మత్స్యకారులకు ఒక్క శాతమైనా ఇవ్వలేదు
బీసీ సొసైటీలకూ పైసా కూడా విదల్చని వైనం  

 
 సాక్షి, హైదరాబాద్: బడా బాబులకు అడిగీ అడక్కముందే వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో గుమ్మరించే బ్యాంకులు బడుగు, బలహీన, రైతు వర్గాలను మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. వారికి రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కొన్ని వర్గాలకు అరకొర రుణాలతో సరిపెడుతుండగా, మరికొన్నింటికైతే అక్షరాలా మొండిచేయి చూపుతున్నాయి. అన్ని వర్గాలనూ కలిపి చూసినా లక్ష్యంలో సగం మందికి మాత్రమే రుణాలిచ్చి అక్కడితో చేతులు దులుపుకున్నాయనేందుకు ఈ ఏడాది రుణ ప్రణాళిక అమలు తీరే నిదర్శనం. వర్గాలవారీగా చూస్తే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పేదల కోసం ఎంతో పాటుపడుతున్నామని ఊరూవాడా ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. సర్కారు ప్రచారంలో డొల్లతనాన్ని రుణ ప్రణాళిక అమలు తీరే ఎత్తిచూపుతోంది. ఈ ఏడాది రూ.1.33 లక్షల కోట్ల రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి ఇచ్చిన రుణాలు రూ.91 వేల కోట్లు మాత్రమే. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల బ్యాంకర్లు మరీ చిన్నచూపు చూశారు. రైతుల పట్ల కూడా నిర్లక్ష్యమే ప్రదర్శించారు. లక్ష్యంలో 57 శాతం రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు. పాడి పరిశ్రమాభివృద్ధికి ఉద్దేశించిన నాబార్డ్ పథకాన్నయితే పూర్తిగా ఎత్తేశారు! ఇవన్నీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) గణాంకాలు చెబుతున్న చేదు నిజాలే.

     చెప్పింది కొండంత...:  రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ఏడాది భారీ ఎత్తున రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణంతో పాటు మహిళలకు వడ్డీ రాయితీ రుణాలను ఘనంగా ప్రకటించారు. అంతేగాక స్వయం ఉపాధి కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యువకులను ప్రోత్సహించడానికి వీలుగా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. దీనికి వడ్డీ రాయితీ రుణాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకాల్లో వేటికీ బ్యాంకర్ల నుంచి సరైన ప్రొత్సహాం అందలేదు. ముఖ్యంగా గిరిగిజన ప్రాంతాల్లోనైతే రుణ మంజూరీ మరీ దారుణంగా ఉంది. రుణాలివ్వాలంటే మైదాన ప్రాంతాలకు సంబంధించిన షూరిటీ సమర్పించాలన్న నిబంధన వల్ల గిరిగిజనులు అసలు రుణాలే పొందలేకపోతున్నారు.

 బడుగులకు బహు స్వల్పం!

 బడుగు, బలహీన వర్గాలకు అవసరమైన మేర రుణాలందడం లేదని మరోసారి తేలింది. ఆయా వర్గాలకు రుణాలిచ్చి, వారి స్వయం ఉపాధికి ప్రోత్సాహమివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో ఎస్‌ఎల్‌బీసీ నివేదికే చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కార్పొరేషన్ల ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర రుణాలివ్వలేదని అది స్పష్టం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న దాంట్లో కేవలం 47 శాతమే ఇవ్వగలిగినట్టు నివేదిక పేర్కొంది. కానీ వాస్తవాలు మాత్రం ఇంకా నిరాశాజనకంగా ఉన్నాయి. ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితైతే మరీ దారుణం. లక్ష్యంలో కేవలం 13 శాతం మందికే రుణాలిచ్చారు.

మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 52 శాతం మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 67 శాతం మందికి రుణాలిచ్చినట్టు మాత్రం నివేదికలో పేర్కొన్నారు. బీసీ సమాఖ్యలకు సంబంధించి 37 వేల సోసైటీలకు రుణాలను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా 1,27,792 మందికి రూ.535.39 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా ఇప్పటికి 154 మందికి మాత్రమే అందించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా 60 వేల మంది లబ్ధిదారులకు రూ.235 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రాజీవ్ యువశక్తి పథకం కింద 11,250 మందికి లబ్ధి చేకూర్చాలని ఘనంగా లక్ష్యం విధించుకున్నా కేవలం 212 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఈ వెనుకంజకు కారణాలనేకం. ప్రభుత్వం సకాలంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, నిధులివ్వకపోవడం, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోకలేకపోవడం, అన్నీ జరిగినా లబ్ధిదారుల ఎంపికను ఆలస్యం చేయడం వంటివి కారణాలు బడుగుల రుణ ఆశలపై నీల్లుజల్లాయి.

 పంట రుణాల పరిస్థితీ అంతే

  పంట రుణాల జారీ కూడా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేదు. ఖరీఫ్ సీజన్‌లో రూ.31,996 కోట్లు, రబీలో రూ.17,993 కోట్ల చొప్పున మొత్తం రూ.49,989 కోట్ల రుణాలివ్వాల్సి ఉంది. కానీ రూ.28,820 కోట్లు మాత్రమే అందించారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరికి ఈ ఏడాది రూ. 2వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇచ్చింది మాత్రం రూ.315 కోట్లే. డెయిరీ, గొర్రెల పెంపకానికి, మత్స్యకారులకు రూ.5,670 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇచ్చిన రుణాలు రూ.13 కోట్లే. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన డీఈడీఎస్ పథకానికి మంగళం పాడారు. నాబార్డ్ సబ్సిడీ అందించే ఈ పథకానికి రుణాలివ్వడం లేదు. ఈ పథకం కింద గేదెల కొనుగోలుతో పాటు, మిల్కింగ్ మిషన్, పాలను నిల్వ చేసే కూలింగ్ సెంటర్  వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రుణాలిచ్చేవారు. దాంతోపాటు నాబార్డ్ సబ్సిడీ కూడా అందించేది. కానీ మార్పుల మాటున పలు ఆంక్షలతో పథకాన్ని కుదించడంతో ఈ ఏడాది డెయిరీలకు రుణాల మంజూరీ గణనీయంగా పడిపోయింది.

మరిన్ని వార్తలు