తిరగరాసి.. మాయ చేసి..!

26 Aug, 2013 04:24 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతను ఆదుకునేందుకు సర్కారు తలపెట్టిన పంట రుణాల పంపిణీ ప్రక్రియ అపహాస్యమవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను బ్యాంకులు కేవలం కాగితాల్లోనే సాధిస్తున్నాయి. రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చే విషయం పక్కనపెట్టి పాత రుణాలనే కొత్తగా మారుస్తూ లక్ష్యాల్ని సాధించినట్లు రికార్డులు చూపిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల ద్వారా రైతులకు రూ.438.15 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇందులో 64.46 శాతం పురోగతి సాధించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు పైసా చేతికందకపోవడం గమనార్హం.
 వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వర్షాలు
 ఆశాజనకంగా ఉండడంతో ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తీవ్ర నష్టాల పాలైన రైతుకు పెట్టుబడి పెట్టే పరిస్థితిలేని ఈ తరుణంలో రుణమిచ్చి అండగా నిలవాల్సిన సర్కారు.. పాత రుణాలనే తిరగరాస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బ్యాంకు రికార్డుల్లో కొత్తగా రుణం తీసుకున్నట్లు గణాంకాలు కనిపిస్తున్నప్పటికీ.. చేతికి మాత్రం చిల్లిగవ్వ రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
 
 ఇలా ‘సాధించారు’..
 2013 ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతాంగానికి రూ.438.15కోట్ల పంటరుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రుణ మంజూరుకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు 61,283 మంది రైతులకు రూ. 282.42 కోట్లు పంట రుణాల కింద పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 64.46 శాతం పురోగతి సాధించినట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది.  అయితే ఇవన్నీ కొత్తగా పంపిణీ చేసిన రుణాలు కాదు. గతంలో పెండింగ్‌లో ఉన్న రుణాలను ఈ ఏడాది భారీగా రెన్యువల్ చేశారు. ఇప్పటివరకు సాధించిన పురోగతిలో 72 శాతం రెన్యువల్ చేసినవేనని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మంజూరు చేసిన రూ.282.42 కోట్ల రుణాల్లో రూ.203.34 కోట్లు రెన్యువల్ పద్ధతిలో పునరుద్ధరించినవే.
 
 కౌలు రైతు రుణ వ్యథ..!
 113 మందిని గుర్తించి, ఏడుగురికి రుణాలు
 జిల్లాలో కౌలు రైతు పరిస్థితి దారుణంగా మారింది. కౌలు రైతులకూ పంట రుణాలిస్తామంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. అసలు ఈ రైతులను గుర్తించడమే కష్టంగా మారినట్లుంది. జిల్లాలో కేవలం 113 మంది కౌలు రైతులు మాత్రమే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కౌలు రైతులు ఒక్కసారిగా ఇంత గా తగ్గిపోయారంటే.. వాళ్లంతా వలస పోయారా... లేక వ్యవసాయశాఖ కళ్లకు గంతలు కట్టుకుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 113 మంది కౌలురైతులను గుర్తించిన వ్యవసాయ శాఖ వారికి రుణ అర్హత కార్డులను జారీ చేసింది. వీరిలో ఏడంటే ఏడుగురికే రుణాలు మంజురు చేసింది. ఈ ఏడుగురికి కేవలం రూ. మూడు లక్షలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే కౌలు రైతులపై సర్కారు ఎంతటి ప్రేమానురాగాలు ఒలకబోస్తుందో తెలుస్తోంది.

మరిన్ని వార్తలు