దా‘రుణం’

13 Jun, 2014 01:36 IST|Sakshi
దా‘రుణం’

 పోలవరం :వ్యవసాయ రుణాల వసూలు కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తిపోతున్నారు. రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. అమలుకు నోచుకోకపోవడంతో అవస్థలకు గురవుతున్నారు. తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ప్రధానంగా బంగారు ఆభరణాలపై వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారంపై రుణాలు తీసుకున్న పోలవరం, గోపాలపురం మండలాల్లోని దాదాపు 200 మంది రైతులకు దొండపూడి ఆంధ్రాబ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిలో పోలవరం మండలం కొత్తపట్టిసీమ గ్రామానికి చెందిన కడియం ప్రభావతి అనే మహిళా రైతు ఒకరు.
 
 ఆమె గత ఏడాది ఏప్రిల్ 13న దొండపూడి ఆంధ్రాబ్యాంకులో బంగారు ఆభరణాలపై రూ.28 వేలను వ్యవసాయ రుణం తీసుకుంది. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని, లేకుంటే ఆభరణాలను వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. రుణాలు తీసుకుని ఏడాది గడచిన రైతులంతా తక్షణమే ఆ మొత్తాలను చెల్లిం చాల్సిందిగా నోటీసులలో పేర్కొంటున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని గంపెడాశతో ఎదురు చూసిన రైతులకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నోటీసుల విషయమై దొం డపూడి ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ వి.బద్రీనాథ్‌ను వివరణ కోరగా, వ్యవసాయ రుణం పొంది ఏడాది దాటినందున సంబంధింత రైతులందరికీ రుణాలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని చెప్పారు. బ్యాంకు నిబంధనలు ప్రకారం రుణాలు తీసుకుని ఏడాది దాటిన 200 మంది రైతులు నిర్దేశించిన గడువులోగా సొమ్ము చెల్లించాలన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు