కౌలు రైతుల మరణ వేదన

30 Oct, 2017 13:37 IST|Sakshi

పెట్టుబడులు పెట్టి.. దిగుబడులు రాక..

అప్పులబాధతో బలవన్మరణాలకు దిగుతున్న కౌలురైతు

పట్టించుకోని ప్రభుత్వం

పరిహారం అందించడంలోనూ పరిహాసం

తనువు చాలించినా అధికారిక లెక్కల్లో తేలని గుర్తింపు

కౌలు రైతుకు కనికరం లభించడం లేదు. అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలకులు శీతకన్ను వేశారు. ఎవరూ ఏం చేసినా వీరికి   పూర్తి స్థాయిలో పథకాలు అందక.. పంటపై పెట్టిన పెట్టుబడులు రాక దినదినగండంగా మారింది. పంట  చేతికి అందేవరకు నిత్యం నరకయాతన అనుభవిస్తూ వ్యవసాయ జూదంలో చివరికి ఓడిపోయి ఈ లోకాన్ని శాశ్వతంగా వీడుతున్నాడు.

సాక్షి, కడప: పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆందోళనకర పరిస్థితుల్లో దిక్కుతోచక మరణమార్గం ఎంచుకుంటున్నా భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు పెట్టుబడులు భారీగా పెట్టినా పంట దిగుబడి రాకపోవడం...తెచ్చిన అప్పుల భారం పెరిగిపోవడంతో తీర్చే దారి తెలియక కౌలు రైతు ఉరి కొయ్యను ఎంచుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకుని కౌలు రైతు తనువు చాలించినా తర్వాత కూడా నిబంధనల సాకుతో కుటుంబానికి పరిహారం అందించకుండా ప్రభుత్వం పరిహాసం ఆడుతుండడం ఆందోళన కలిగించే పరిణామం.

కనికరమేదీ..
 కౌలు రైతుల విషయంలో ఎవరూ కనికరం చూపడం లేదు. బ్యాంకులకు వెళ్లినా గుర్తింపు కార్డులు లేవని రుణాలు ఇవ్వకపోవడం..బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడంతో రైతుపై భారం పెరుగుతోంది.అంతంతమాత్రంగా వచ్చి న దిగుబడితో అప్పులు తీర్చలేక  చావే శరణ్యమని పలువు రు రైతులు బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారు. జిల్లాలో పంటలు పండక, సక్రమంగా రుణమాఫీ జరగక, పెరిగిన అప్పుల భారంతో ఇప్పటికే 40–45 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో కౌలు రైతులే 12 నుంచి 15 మంది చనిపోయినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.  

పరిహారం..పరిహాసం
 జిల్లాలో అనేక మంది రైతులు మృత్యువాత పడుతున్నారు. సాకు ఏదైనా పరిహారం అందని విషయం మాత్రం వాస్తవం. అన్నిచోట్ల పంటలపై పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక అప్పుల బాధతో రైతన్నలు తనువు చాలిస్తే ఇప్పటికీ పరిహారం మాత్రం కేవలం కొద్దిమందికి మాత్రమే అందించారు. కౌలు రైతుల విషయానికి వస్తే అధికారికంగా ఒకరినే గుర్తించారు. అయితే కౌలు రైతులు అనేక మంది చనిపోతున్నా..గుర్తింపుకార్డులు లేవని...ప్రభుత్వ గుర్తింపు లేదని చెబుతూ అందించే పరిహారానికి రైతు కుటుంబాలను దూరం చేస్తున్నారు.   పరిహారం విషయంలోనూ అధికారులు పరిహాసమాడుతున్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. కౌలు రైతుల కుటుంబాల బాధలు వర్ణనాతీతం.కౌలురైతుల మరణానంతరం కుటుంబాలు ఎలా ఉన్నాయన్న పలుకరింపు కూడా లేదు. పరిహారం రాక...తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబ పెద్దను పోగొట్టుకున్న కుటుంబాలు నిత్యం నరకయాతనతో అల్లాడిపోతున్నాయి. మానవతా దృక్పథంతోనైనా తనువు చాలించిన కుటుంబాలకు పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేయాలని పలువురు రైతు కుటుంబాలు సూచిస్తున్నాయి.

నేటికీ పరిహారం అందలేదు
నా పేరు మంగమ్మ. రాయచోటి మండలం, శిబ్యాల గ్రామం. సుండుపల్లె మండలంలో 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం.పంటలు పండక..పెట్టుబడులు  రాక సుమారు రూ.7లక్షల వరకు అప్పులు మిగిలాయి.  మనస్థాపంతో నా భర్త కేతమరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి గత ఏడాది జులై 23వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు.కుటుంబ పెద్దను కోల్పోడంతో కుమారున్ని చదువు మాన్పించాల్సి వచ్చింది.కుమార్తెను అష్టకష్టాలు పడి చదివిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై కనికరం చూపి పరిహారాన్ని అందించాలి.

మరిన్ని వార్తలు