కోటయ్యది రాజకీయ హత్యే..

7 Jul, 2019 09:13 IST|Sakshi
మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

సాక్షి, గుంటూరు : హత్యకు గురైన తెనాలికి చెందిన దళిత నాయకుడు పమిడిపాటి కోటయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు జీజీహెచ్‌ మార్చురీ వద్ద శుక్రవారం అప్పగించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మార్చురీ వద్దకు వచ్చి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న కోటయ్య బంధువులు, ప్రజాసంఘాల నాయకుల ఫిర్యాదులు విన్నారు. అందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  సమగ్ర విచారణ చేపట్టి కోటయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.  

పార్టీలకు రహితంగా అంతా ఇటువంటి చట్ట వ్యతిరేక ఘటనలను  ఖండించాలన్నారు. నిందితులు ఎవరైనా సరే చట్టం చట్ట ప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాణం విలువైనదని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులతో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని చెప్పారు. కోటయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కటివరపు దేవయ్య, ఆలూరి అంబేద్కర్, మేరుగ కిరణ్‌నాగ్‌ తదితరులు ఉన్నారు. 

జిల్లా అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించిన నాయకులు
జిల్లా కలెక్టర్‌ లేదా ఎస్పీ మార్చురీ వద్దకు వచ్చి కోటయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదలనీయమంటూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు, దళిత సంఘాల నాయకులు మార్చురీ గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంచికిచర్ల చిట్టిబాబు, ఏఐసీసీ నాయకులు జాన్‌ బెన్నిలింగమ్‌ ,ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌దాసు, కె.వి.పి.ఎస్‌ జిల్లా కార్యదర్శి పి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ 11 నెలల క్రితం కోటయ్య కుమారుడు సత్యవంశీ హత్యకు గురయ్యాడని, పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయలేదని ఆరోపించారు.

 న్యాయం చేయమంటూ కోటయ్య అధికారులందరి చుట్టూ తిరిగినా  జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో కోటయ్య వైఎస్సార్‌ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారని, ఈ నేపథ్యంలోనే రాజకీయ హత్య జరిగిందన్నారు. మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా కోటయ్య సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌లు పెట్టాడని చెప్పారు. మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఈ కేసులో ఎ–2గా చేర్చాలని డిమాండు చేశారు.

ఆలపాటి, నక్కా ఆనంద్‌బాబు ప్రోత్సాహంతోనే...
 బీజేపీ వేమూరు నియోకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దర్శనపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబులు ఈ హత్యలో ప్రత్యక్ష పాత్ర వహించారని ఆరోపించారు. వారి ప్రోత్సాహంతోనే వారి అనుచరులే ఈ హత్య చేశారని  తెలిపారు. 

ఎస్పీ హామీతో ధర్నా విరమణ 
అర్బన్‌ ఎస్పీ పి.హెచ్‌డి.రామకృష్ణ మార్చురి వద్దకు వచ్చి కోటయ్య బంధువులు, దళిత నాయకులతో చర్చించారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ధర్నా విరమించారు. డీఎస్పీలు ప్రకాష్‌బాబు, రామాంజనేయులు ,నజీముద్దీన్, అర్బన్‌ పరిధిలోని పలు స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు, సిబ్బంది మార్చురి వద్ద ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు.  

 అమృతలూరులో ఎమ్మార్పీఎస్‌ రాస్తారోకో
చేబ్రోలు మండలం వేజెండ్ల, నారాకోడూరు గ్రామాల మధ్య నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య మాదిగ శుక్రవారం రాత్రి హత్యకు గురవడంతో ఆయన స్వగ్రామం అమృతలూరులో రాస్తారోకో నిర్వహించారు. ఉత్తర దళితవాడలోని తెనాలి – చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై శనివారం అమృతలూరు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా తాటిబొత్తలు వేసి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాట్లాడుతూ కోటయ్య మాదిగను హత్య చేసిన అగంతకులను వెంటనే పట్టుకొని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇది ముమ్మాటికీ టీడీపీ నాయకుల కుట్రేనని అన్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చుండూరు సీఐ బి. నరసింహారావు ఆధ్వర్యంలో తెనాలి సీసీఎస్‌ సీఐ ప్రభాకర్, అమృతలూరు ఎస్‌ఐ జి. పాపారావు, పీఎస్‌ఐ షేక్‌ అమీనుద్దీన్, ఏఎస్‌ఐ హైమారావు, పోలీసు సిబ్బంది బందోబస్తు పర్యవేక్షించారు. రాస్తారోకోలో వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతార్లంక సురేష్, కనగాల ప్రభాకర్, మట్లపూడి కోటేశ్వరరావు, పార్టీ మండల యూత్‌ కన్వీనర్‌ బర్మా ప్రవీణ్‌కుమార్, నేతలు నన్నెపాగ భూషణం, మానుకొండ రోశయ్య, వేసపోగు శ్రీకాంత్, ఆరెమండ్ల సుధాకర్, ఆలూరి ప్రభాకరరావు, మహేష్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు