‘చెప్పిందే రేటు.. ఇష్టముంటే తాగు’

15 Oct, 2019 08:56 IST|Sakshi

కొత్త మద్యం విధానం అమలు.. పర్మిట్‌ గదులు ఎత్తివేత.. సమయం కుదింపు.. ఎక్కడి కెళ్లి తాగాలో అర్థం కాక మందుబాబులు బార్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఇష్టారాజ్యంగా ధరలు.. కల్తీ మద్యం విక్రయంతో ఒళ్లు, జేబులు గుల్ల అవుతుండడంతో బారు పక్కకెళ్లొద్దు రో సోదరా..అని అంటున్నారు. ఇదీ జిల్లాలో బార్ల పరిస్థితి. 

సాక్షి, చిత్తూరు అర్బన్‌ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా దశలవారీగా మద్యం దుకాణాలు తీసేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఇదే అదునుగా జిల్లాలోని కొందరు మద్యం బార్ల నిర్వాహకులు ధరలపై నియంత్రణ ఎత్తేసి ‘చెప్పిందేరేటు.. ఇష్టముంటే తాగు’ అన్నట్లు భారీగా దోచుకుంటున్నారు. స్వయాన జిల్లాలో ఆబ్కారిశాఖకు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

ప్రభుత్వ లక్ష్యానికి ప్రమాదం
మద్యం దుకాణాలను దశలవారీగా తొలగించి, ఐదేళ్లలో మద్యాన్ని కేవలం ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు జిల్లాలో ఉన్న 430 మద్యం దుకాణాల సంఖ్యను 344కు కుదించారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని తొమ్మిది గంటలకే పరిమితం చేశారు. 21 ఏళ్ల వయస్సు పైబడ్డవారికే మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇన్ని నిబంధనలు పెడితే కచ్చితంగా ఆ ప్రభావం విక్రయాలపై చూపుతుంది.

ఆదాయం రాకున్నా పర్లేదని.. మహిళలకు ఇచ్చిన మాటకోసం ఓ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇదే అదునుగా చేసుకున్న జిల్లాలోని చాలామంది బార్ల నిర్వాహకులు మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి ఉన్నా వీటిని పాటించడంలేదు. చిత్తూరు నగరంలోని ఓ టీడీపీ నేతకు చెందిన మద్యం బార్‌లో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. 

ధరలు ఇష్టారాజ్యమేనా?
ఇక మద్యం బార్లలో ఇటీవల ధరలు విపరీతంగా పెంచేశారంటూ మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరచి.. రాత్రి 8గంటలకు మూసేస్తుండటం, పైగా గతంలో మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్‌ గదులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం బార్ల నిర్వాహకులకు బాగా కలిసొచ్చింది. మద్యం తీసుకుని ఎక్కడికెళ్లి తాగాలో తెలియక మందుబాబులు దుకాణాల్లో మద్యాన్ని కొనడానికన్నా.. బార్లలో తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న బార్ల నిర్వాహకులు మద్యంపై ధరలను ఇçష్టప్రకారం పెంచేసి, విక్రయాలు చేస్తున్నారు. ఏసీలు లేకున్నా సర్వీసుటాక్స్‌ వేయడం, రెస్టారెంట్, జీఎస్టీ పేరు చెప్పి రూ.వెయ్యి బిల్లుకు రూ.1300 సైతం వసూలు చేస్తున్నారు. బయట రూ.వందకు దొరికే క్వార్టర్‌ మద్యాన్ని, బార్‌లో ఏకంగా రూ.180కు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మాకు ఎమ్మార్పీ ఉండదు. ఇష్టం ఉంటే తాగు, లేకుంటే వెళ్లిపోవచ్చు’ అంటూ మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. 

సాంపిల్స్‌ తీసేవాళ్లేరీ...
మరోవైపు బార్లలో లూజు విక్రయాలకు అనుమతి ఉండటంతో కొన్నిచోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. ప్రతినెలా మూడుసార్లు బార్లలో లూజు మద్యాన్ని సేకరించి ప్రయోగశాలకు పంపాల్సిన ఆబ్కారీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతో పాటు ప్రమాదం కూడా పొంచివుంది.

మదనపల్లెలో బార్లు – 6 రోజువారీ వ్యాపారం  – రూ.7 లక్షలు
చిత్తూరులో బార్లు  – 7 రోజువారీ వ్యాపారం  – రూ.9 లక్షలు
తిరుపతిలో బార్లు  – 18 రోజువారీ వ్యాపారం  – రూ.1.20 కోట్లు
బార్‌ అండ్‌ క్లబ్‌   – 1 రోజువారీ వ్యాపారం – రూ.4 లక్షలు
టూరిజం బార్లు  – 2 రోజువారీ వ్యాపారం – రూ.4 లక్షలు
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా