మామూలిచ్చి అమ్ముకోండి!

19 Nov, 2013 01:27 IST|Sakshi

మంత్రిగారి బంధువుబంపర్ ఆఫర్
 =ఇండెంట్ చెల్లించి పది శాతం ఎక్కువకు అమ్ముకోండి
 =మంత్రిగారి పేరిట వసూళ్లు

 
 కప్పం కట్టండి.. ఎక్కువకు అమ్ముకోండి.. ఇదీ జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు మంత్రి గారి బంధువు నుంచి వచ్చిన బంపర్ ఆఫర్. ఇప్పటికే అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, ఇప్పుడు అమాత్యుడి పేరుతో
 అడిగితే తమకు ఇబ్బందేనని వాపోవడం నిర్వాహకుల వంతయింది.. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం...
 
సాక్షి, విజయవాడ : జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే రూ.40 వేలు కప్పం కడితే ఎంఆర్‌పీ కన్నా పది శాతం ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోం అని. అయితే ఈ హామీ అబ్కారీ శాఖ నుంచి కాకుండా ఆ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న మంత్రిగారి దగ్గర బంధువు నుంచి రావడం విశేషం.
 
ఈ అంశంలో మంత్రి పుంగవుడు ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. ఆయనకు దగ్గర బంధువుగా సిండికేట్లతో పాటు అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి... అవసరాల కోసం మనం ఇవ్వడం మంచిదని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాన్‌పిక్ కేసులో అప్పటి అబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
 
అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన...


జిల్లాలో 360 వరకూ వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రూ.40 వేలు మంత్రికి నజరానాగా ఇవ్వాలని అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన తెచ్చింది కూడా మంత్రి బంధువే. ఈ బంధువే ఈ అసోసియేషన్‌లో కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు జిల్లాలోని వైన్‌షాపుల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా, బార్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వారికి లూజ్ అమ్మకాలు, ఎంఆర్‌పీ కన్నా ఎక్కువకు అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అదే బార్‌ల విషయానికి వస్తే రేటు ఎంతకి అమ్మాలన్న నిబంధనలు లేవు. దీంతో వారు ఈ ఆఫర్‌ను వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలోని 60 నుంచి 70 షాపుల వారు సదరు నేతకు రూ.40 వేల చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించిన వారి షాపులపై కూడా ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఒకసారి కేసు నమోదై షాపు మూతపడితే మళ్లీ తెరుచుకోవడానికి కనీసం నెలరోజులు పడుతుంది. రాజధాని స్థాయి నుంచి మళ్లీ అనుమతులు రావాల్సి ఉండటం, ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపడానికి చాలా సమయం పట్టడం దీనికి కారణం. దీనివల్ల ఆయా షాపులకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వ్యాపారంలో నష్టం వస్తోంది.
 
షాపుల యజమానుల షరతు...

డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కేసులు రాస్తుండటంతో వారు అడ్డం తిరిగినట్లు సమాచారం. తమ జోలికి రాకుండా ఉంటేనే డబ్బులు ఇస్తామని మిగిలిన షాపుల వారు మొండికేస్తున్నట్లు సమాచారం. కనీసం నెలన్నర రోజులైనా ఎటువంటి దాడులూ జరగవని హామీ ఉంటే అడిగిన మొత్తం ఇస్తామని వైన్‌షాపుల యజమానులు షరతు పెట్టారు. దీంతో నాలుగురోజుల క్రితం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ విషయంలో కోపంగా ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. కేవ లం ఇద్దరు ముగ్గురు మాత్రమే రావడంతో మిగిలిన వారితో సదరు నేత ఫోన్‌లో సంప్రదింపులకు తెరతీసినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బార్ యజమానులు చాలామంది అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, కొత్తగా మళ్లీ మంత్రిగారి పేరుతో అడిగితే తాము ఇచ్చేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అసలు మంత్రిగారికి ఇస్తారో లేదో కూడా తమకు అనుమానాలున్నాయని, అందుకే ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అధికార పార్టీకి చెందిన బార్ యజమాని ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు