బరం పార్కు చేజారేనా!

7 Aug, 2015 01:13 IST|Sakshi
బరం పార్కు చేజారేనా!

ఇప్పటికే భవానీద్వీపం ప్రై‘వేటు’కు యత్నాలు
మంత్రులకు, ఉన్నతాధికారులకు బరం పార్కు  గదుల కేటాయింపు యోచనలో పాలకులు
పర్యాటకులకు కేటాయిస్తేనే ఉపయుక్తం

 
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస ్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని బరం పార్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవానీద్వీపాన్ని, బరం పార్కు స్థలాన్ని ఏపీటీడీసీకి ఇచ్చారు. 2002లో బరం పార్కులో రెస్టారెంట్లు, గదులను, 2004లో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు. భవానీద్వీపంలో నేటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు.

 అయినా ద్వీపం, బరం పార్కులు ఏపీటీడీసీకి లక్షల ఆదాయం సమకూర్చి పెడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవానీద్వీపాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని అందరూ భావించారు. ఏడాదిన్నర అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టలేదు.
 
భవానీద్వీపం ప్రై’వేటు’కు యత్నాలు
 ఇటీవల వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినప్పుడు 133 ఎకరాల్లోని భవానీద్వీపం అభివృద్ధి గురించి చర్చకు వచ్చింది. ద్వీపం ఒకటే కాదని, నదిలోని చిన్నచిన్న ద్వీపాలతో కలిసి మొత్తం ఐదువేల ఎకరాలను ఏమీ చేయాలనే అంశంపై తనకు ప్రత్యేక ఆలోచన ఉందని సీఎం తెలిపారు. ఇటీవల సింగపూర్, జపాన్ బృదాలు వచ్చినప్పుడు వారికి బరం పార్కును, భవానీద్వీపాన్ని కలెక్టర్ వ్యక్తిగతంగా చూపించారు. దీన్నిబట్టి భవానీద్వీపాన్ని ప్రై‘వేటు’ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 బరం పార్కును పరిశీలించిన మంత్రి నారాయణ
 బుధవారం మున్సిపల్ మంత్రి నారాయణ ఆకస్మికంగా బరం పార్కును పరిశీలించారు. గదులు ఎన్ని ఉన్నాయి. సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉందా తదితర సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ గదులను మంత్రులకు గాని, ఉన్నతాధికారులకు గాని కేటాయిస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ఆరా తీసినట్లు సమాచారం. దీంతో ఏపీటీడీసీ అధికారులు, సిబ్బందిలో కలకలం మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడకు తరలించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బరం పార్కులోని గదులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. వీటిని మంత్రులకు కాని, ఉన్నతాధికారులకు కాని,
 ఏదైనా ప్రభుత్వ శాఖకు కేటాయిస్తే.. పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడతారని ఏపీటీడీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేవలం సమావేశాలు నిర్వహించుకునేందుకే దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప పూర్తిగా స్వాధీనం చేసుకోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

 రూ.కోటిన్నరతో అభివృద్ధి
 బరం పార్కు, భవానీద్వీపంలోని గదుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇటీవలే ఏపీటీడీసీ అధికారులు రూ.కోటిన్నరతో మరమ్మతులు చేయించారు. పాడైపోయిన ఏసీలు బాగు చేయించడం, ఫ్లోరింగ్, రంగులు వేయించి, అవసరమైన గదుల్లో సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా రాత్రులందూ క్యాండిల్ డిన్నర్, ఉదయం బోట్‌లో బ్రేక్‌ఫాస్టులు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం కన్నేయడం అధికారులకు మింగుడు పడటం లేదు.
 
అద్దెకు తీసుకుంటారని అనుకుంటున్నా
 బరంపార్కులోని గదులను, రెస్టారెంట్‌ను ఇటీవల కోటిన్నరతో అభివృద్ధి చేశాం. ఇతర పర్యాటకుల లాగానే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వీటిని తీసుకుని అద్దె చెల్లిస్తారని భావిస్తున్నాం. పర్యాటక కేంద్రంగానే దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. బరం పార్కును మంత్రులకు కేటాయించడంపై ఉన్నతాధికారుల నుంచి ఏ విధమైన ఆదేశాలూ అందలేదు.
 - డీవీఎం వి.వి.ఎస్.గంగరాజు
 

మరిన్ని వార్తలు