‘బార్‌కోడ్' విధానంతోనే మద్యం విక్రయాలు

7 Nov, 2014 04:30 IST|Sakshi
‘బార్‌కోడ్' విధానంతోనే మద్యం విక్రయాలు

కర్నూలు:
 బార్ కోడ్ విధానం ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని వ్యాపారులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు  ఆదేశించారు. మద్యం వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం వ్యాపారులు ఈ విధానం అమలుపై అయిష్టత వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయి యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించారు.

అయితే ఈనెల 15వ తేదిలోగా హోలోగ్రామ్ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఎస్‌ఎస్.రావత్ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆరు నెలల క్రితమే అధికారులకు ఈ ప్రాజెక్టు అమలుపై మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసిందే. గురువారం జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మద్యం వ్యాపారులను కార్యాలయానికి రప్పించి ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు సమీక్ష  నిర్వహించారు.

కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఏఈఎస్ హెప్సిబారాణి, కర్నూలు సీఐ పద్మావతితో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3జీ సిమ్, ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు ఇన్‌చార్జి డీసీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 194 మద్యం దుకాణాలు, 30 బార్లు ఉన్నాయి.

అన్ని దుకాణాల్లో కూడా బార్‌కోడ్ విధానం ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు.  డిసెంబర్ 1 నుంచి 2డీ బార్‌కోడింగ్ పద్దతిలోనే విక్రయాలు జరగనున్నాయి. ఈ విధానం అమలు వల్ల జిల్లాలోని మద్యం డిపోతో పాటు రీటైల్ దుకాణాల్లో విక్రయాల స్టాక్ వివరాలు, హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు