లాభాల పంట

6 Jan, 2014 01:57 IST|Sakshi
  • బీడు భూముల్లోనూ పంటల సాగు
  •  పొదుపుగా నీటి వనరుల వినియోగం
  • ఆదర్శప్రాయం మాలీల వ్యవసాయం
  •  
    చింతపల్లి, న్యూస్‌లైన్: కూరగాయల సాగుతో మాలీ తెగ గిరిజనులు ఆర్థికంగా మంచి లాభాలు సాధిస్తున్నారు. ఒడిశాకు చెందిన వీరు కూరగాయలను ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. గతంలో తాము పండించిన కూరగాయలను కావళ్లతో వారపు సంతలకు తీసుకువెళ్లి విక్రయించేవారు. నేడు పెద్ద మొత్తంలో పంటలను సాగు చేసి ప్రత్యేక వాహనాల్లో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ స్థానిక గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

    ఒడిశా నుంచి 20 ఏళ్ల కిందట మాలీ గిరిజన తెగకు చెందిన సుమారు 40 కుటుంబాలు మండలంలోని చౌడుపల్లి, పెంటపాడు, జీకే వీధి మండలంలోని రింతాడ, మాలిగూడ గ్రామాలకు వలస వచ్చారు. స్థానిక గిరిజనుల నుంచి నీటి సౌకర్యం ఉన్న భూములను కౌలుకు తీసుకుని కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. క్యాబేజీ, బంగాళాదుంప, అల్లం, పచ్చిమిర్చి, టమోటా, వంగ, బెండ, కొత్తిమెర, తోటకూర, చుక్కకూర , చిలకడ, నాగలి దుంపలను సాగు చేస్తున్నారు.

    అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం వీరి సాగులో ప్రత్యేకత. స్వయం కృషితో బీడు భూములను సైతం సాగులోకి తీసుకువచ్చారు. నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచారు. ఏడాది పొడవున వివిధ రకాల కూరగాయలను పండిస్తూ వసతి గృహాలతో పాటు నర్సీపట్నం, తుని, రాజమండ్రి, అనకాపల్లి, గాజువాక వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలను రవాణా చేసేందుకు ఆయా గ్రామాల్లోని గిరిజనులంతా కలిసి వ్యాన్లు ఏర్పాటు చేసుకున్నారు. చిలకడ, నాగలి (పెండ్లం)దుంపలను విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఐటీడీఏ కూడా కూరగాయల సాగుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తోంది.
     
    అమ్మకం బాధ్యత మహిళలదే...
     
    స్థానిక గిరిజనుల మాదిరిగా వీరు పండించిన కూరగాయలను వారపు సంతలకు తీసుకువెళ్లి దళారులకు విక్రయించరు. సంతల్లో మహిళలే దుకాణాలు ఏర్పాటు చేసుకుని నేరుగా విక్రయిస్తుంటారు. దీంతో దళారుల చేతిలో మోసపోయే అవకాశం ఉండదని మాలీ తెగ గిరిజనులు చెబుతున్నారు.
     

మరిన్ని వార్తలు