ఆద్యంతం అడ్డంకులే

2 Apr, 2014 02:31 IST|Sakshi

ముత్తుకూరు, న్యూస్‌లైన్ : దేశంలో ప్రప్రథమంగా నేలటూరులో ఏపీ జెన్‌కో చేపట్టిన 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి సర్కారు నిర్లక్ష్యం శాపంగా పరిణమించింది.
 
 ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌లకు అనుసంధానం చేసే విద్యుత్ లైన్ల పనులు పూర్తికాకపోవడంతో ఈ వేసవిలో కూడా ప్రజలకు కోతలు తప్పేలా లేవు. సోమవారం రాత్రి ప్రాజెక్టులో సింక్రనైజేషన్ పూర్తయినట్టు జెన్‌కో సీఈ ఎంవీవీ సత్యనారాయణ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
 
 అయితే విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో 45 మెగావాట్లు మాత్రమే గ్రిడ్‌కు అనుసంధానం చేయగలిగామన్నారు. విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టు సిద్ధంగా ఉన్నప్పటికీ మే నెలాఖరు వరకు గ్రిడ్‌లకు అనుసంధానం చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు. చిత్తూరు, మనుబోలు గ్రిడ్‌లకు పవర్‌గ్రిడ్, ట్రాన్స్‌కోలు చేపట్టిన 765 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తికాకపోవడం జెన్‌కో ప్రాజెక్టుకు శాపంగా మారింది. సర్కారు వైఫల్యం, నిర్లక్ష్యం ప్రతిబంబిస్తోంది.
 
 పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం
 దేశంలో మొదటిసారిగా ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో చేపట్టిన 1600 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ విద్యుత్‌కేంద్రం పలు ఒడిదుడుకులు, ఆటుపోట్ల మధ్య ఎట్టకేలకు ఉత్పత్తికి సిద్ధమైంది. 2009లో రూ.8,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. బీహెచ్‌ఈఎల్, ఎల్‌అండ్‌టీ, టాటా సంస్థలకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అయితే, తీవ్ర జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. ప్రాజెక్టు ఖర్చు రూ.10,400 కోట్లకు చేరిందని సీఈ సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. అంటే, ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.6 కోట్లు ఖర్చయిందన్నారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మొదలైతే రాష్ట్రంలో కోతలు కొంత నివారించవచ్చన్నారు. 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ఒక రోజుకు 18,000 టన్నుల బొగ్గు అవసరమవుతుందన్నారు. ఇందుకోసం 30 శాతం విదేశీ, 70 శాతం స్వదేశీ(తాల్చేరు) బొగ్గు వినియోగిస్తామన్నారు. ఈ బొగ్గు కాల్చినందుకు 27.5 శాతం బూడిద విడుదలవుతుందన్నారు.
 
 మూడో దశ కింద 800
 మెగావాట్ల ఉత్పత్తి
 జెన్‌కో ప్రాజెక్టులో మూడో దశ కింద మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సర్కారు అనుమతి లభించిందని సీఈ చెప్పారు. త్వరలో దీనికి టెండర్లు పిలుస్తారన్నారు. బొగ్గు కన్వేయర్ నిర్మాణం పూర్తికాలేదని, అప్పటి వరకు పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టు సిద్ధం కావడం వెనుక ఇంజనీర్లు, కార్మికులు, పరిసర గ్రామాల ప్రజల సహకారం చాలా ఉందన్నారు. ఈ సమావేశంలో సీఈ రత్నబాబు, ఎస్‌ఈలు నారాయణమూర్తి, దేవప్రసాద్, చంద్రశేఖరరాజ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు