బార్ల లైసెన్స్‌ దరఖాస్తుకు 9 వరకు గడువు

7 Dec, 2019 03:53 IST|Sakshi

గెజిట్‌ నోటిఫికేషన్‌కు రెండోసారి సవరణ జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ

సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బార్ల లైసెన్సులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. స్పందన లేకపోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించి 487 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 5వ తేదీ వరకు గడువు విధించారు.

పెద్దగా స్పందన లేకపోవడంతో మళ్లీ ఒక రోజు గడువు పెంచి సవరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 301 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలు ఉండగా, అసలు 45 మున్సిపాలిటీల్లోని బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్‌ శాఖ రెండో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ దశల వారీగా మద్య నిషేధం వైపు అడుగులు వేయడం వల్లే దరఖాస్తులు రావడం లేదని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

>
మరిన్ని వార్తలు